Imran Khan Nomination Rejected : పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వద్దామని ఆశించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరో రెండు నెలల్లో జరగనున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం ఇమ్రాన్ ఖాన్ వేసిన నామినేషన్లను పాక్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఆయన పోటీ చేసేందుకు అవకాశమే లేకుండా పోయింది.
ఇమ్రాన్ నామినేషన్ తిరస్కరణ
2022లో అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని పదవి కోల్పోయినప్పటి నుంచి మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. ప్రభుత్వ కానుకలకు సంబంధించిన తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను దోషిగా తేలుస్తూ ఆగస్టు 5న ఇస్లామాబాద్ జిల్లా కోర్టు మూడేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో భారీ భద్రత మధ్య ఇమ్రాన్‌ను ఆగస్టు 19న అధికారులు అరెస్టు చేశారు.
కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఇమ్రాన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. అయితే అధికార రహస్యాలను బయటకు వెల్లడించిన కేసులో నమోదైన మరో కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష కారణంగా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలపై స్పష్టత రావడంలేదు.
ఇదేసమయంలో ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో జరగనున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలనుకున్నారు. ఇందుకు శుక్రవారం మియాన్‌వాలీ, లాహోర్ నియోజకవర్గాల నుంచి ఇమ్రాన్ తరఫున పీటీఐ నేతలు నామినేషన్ పత్రాలను ధాఖలు చేశారు. ఆ నామపత్రాలను పాక్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకుండా పోయింది.
పాక్‌లో చక్రం తిప్పుతున్న ముంబయి పేలుళ్ల సూత్రధారి
మరోవైపు కరుడు గట్టిన ఉగ్రవాది 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన "ది పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్" పార్టీ పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. ప్రస్తుతం పలు మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టై పాక్ జైల్లో ఉన్న హఫీజ్ అక్కడి నుంచే దేశ రాజకీయాలను శాసిస్తున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి. హఫీజ్ తనయుడు తల్హా సయీద్ ఎన్‌ఏ-127వ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని ఇటీవల భారత్ పాకిస్థాన్‌ను అధికారికంగా కోరింది. ఖైదీల అప్పగింతకు ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని పాక్ తెలిపింది. హఫీజ్ పార్టీ పోటీపై స్పందించేందుకు భారత్ నిరాకరించింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాద శక్తులు అక్కడి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఆ దేశ అంతర్గత వ్యవహారమని వెల్లడించింది. ఆ విషయంపై స్పందించాలనుకోవడంలేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Toshakhana Case Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట.. అవినీతి కేసులో తీర్పు సస్పెన్షన్
Cipher Case : రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్‌పై అభియోగాలు.. నేరం రుజువైతే ఉరిశిక్ష!