Imran Khan no confidence: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై కీలకమైన అవిశ్వాస తీర్మానం ఆదివారం పార్లమెంటు ముందు ఓటింగుకు రానుంది. దాదాపు నెల రోజులుగా ఇమ్రాన్ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్టుగా సాగుతున్న మాటల యుద్ధం ముగింపు దశకు వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వ సారథిగా 2018 ఆగస్టులో పాక్ పాలనాపగ్గాలు చేపట్టిన ఈ మాజీ క్రికెటర్ భవితవ్యాన్ని తీర్మాన ఫలితం తేల్చనుంది. పాక్ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ప్రధాని కూడా అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. గత రెండు సందర్భాల్లోనూ 'అవిశ్వాసం' ప్రధాని పీఠాలను కదిలించలేకపోయింది. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిపక్షాలకు ఇన్‌స్వింగ్ యార్కర్ బంతి వేస్తానని హామీ ఇచ్చిన ఇమ్రాన్ పరిస్థితుల ప్రభావం వల్ల రనౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు కీలక భాగస్వామ్య పక్షాలు దూరం కావడం, సొంత పార్టీ సభ్యులు కొందరు ఎదురుతిరగడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
Imran Khan PTI: 'నయా పాకిస్థాన్' నినాదంతో నాలుగేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన 'పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్' పార్టీ అధినేత ఇమ్రాన్ ఇపుడు తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కూడలిలో నిలబడ్డారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు తన వద్ద ఒకటి కంటే ఎక్కువ ప్రణాళికలే ఉన్నాయంటున్న ఇమ్రాన్ పాక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన 'విదేశీ కుట్ర'కు నిరసనగా శాంతియుత ప్రదర్శనలు చేయాలని దేశ యువతకు పిలుపునివ్వటం గమనార్హం. ప్రదర్శనల్లో ఆర్మీని ఎక్కడా విమర్శించవద్దని ప్రత్యేకంగా కోరడం విశేషం. విద్రోహులను విడిచిపెట్టేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళదామంటే అవిశ్వాసం విషయంలో తాము కూడా వెనక్కు తగ్గుతామని ప్రతిపక్షాలు ప్రభుత్వంతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు సైతం వినవస్తోంది.
బజ్వా కీలక వ్యాఖ్యలు: 'ఉక్రెయిన్ వంటి చిన్నదేశంపై రష్యా ప్రదర్శిస్తున్న దూకుడును క్షమించలేం. చురుకైన శక్తులుంటే తమను తాము రక్షించుకోగలమని ఉక్రెయిన్ పోరాటం చిన్న దేశాలకు భరోసా ఇచ్చింది' అని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా అన్నారు. పాక్‌లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగుకు ఒకరోజు ముందుగా పలు అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో తాము సుదీర్ఘకాలం వ్యూహాత్మక సత్సంబంధాలు కలిగి ఉన్నామని, చైనాతోనూ అంతే సన్నిహితంగా ఉన్నట్లు తెలిపారు. ఇస్లామాబాద్ భద్రతా మండలి సమావేశంలో రెండోరోజు శనివారం బజ్వా మాట్లాడుతూ.. క్యాంపు రాజకీయాలను మాత్రం పాక్ ఎన్నడూ విశ్వసించలేదన్నారు. కశ్మీర్ సహా భారత్, పాక్‌ల మధ్య ఉన్న వివాదాలన్నీ చర్చల ద్వారానే శాంతియుతంగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాతో భారత్‌కున్న సరిహద్దు వివాదాలు పాక్‌కు కూడా సమస్యాత్మకంగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగాలన్న భావన స్ఫురించేలా మాట్లాడారు.
ఇదీ చదవండి: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అసలేమైంది?.. ఎవరు బాధ్యులు?