Imran Khan No-confidence motion: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ఆయన ప్రభుత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష పార్టీలు జాతీయ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై ఏప్రిల్ 3న ఓటింగ్ జరగనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కుతారా అంటే కష్టమే అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. తన కేబినెట్‌కు చెందిన సొంత మంత్రులే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన జాతీయ అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవడం దాదాపు అసాధ్యమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇమ్రాన్‌కు ఉన్న బలమెంత..? విశ్వాస పరీక్షలో ఆయన నెగ్గగలరా..?
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 సీట్లు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ 149 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజార్టీ లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రులతో ఇమ్రాన్ ఖాన్ చేతులు కలపడంతో సంఖ్యా బలం 176కు పెరిగింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కొద్ది కాలానికే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. దీనికి తోడు పాకిస్థాన్ అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభం మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు సైన్యం కూడా ఆయనపై అసంతృప్తిగా ఉంది. దీంతో ఇమ్రాన్‌పై అసమ్మతి సెగ మొదలైంది.
ఈ క్రమంలోనే ఆయనను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదిపాయి. జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మరోవైపు ఇమ్రాన్‌పై సొంత పార్టీకి చెందిన ఎంపీలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు సభ్యులు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ తంటాలు పడుతున్నారు. ఇమ్రాన్‌ను పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం.
ప్రభుత్వ సంఖ్యా బలం ఇలా..
- పీటీఐ - 155
- ఎంక్యూఎంపీ - 7
- పీఎంఎల్(క్యూ) - 4
- బీఏపీ - 1
- గ్రాండ్ డెమోక్రటిక్ అలియన్స్ - 3
- ఏఎంఎల్ - 1
మొత్తం - 171 ; పీటీఐకి చెందిన 24 మంది ఎంపీలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అవిశ్వాస తీర్మానంలో వారు ఇమ్రాన్‌కు మద్దతుగా ఓటేస్తారన్న నమ్మకం లేదు.
ప్రతిపక్షాల బలం ఇలా..
- పీఎంఎల్‌ఎన్ - 84
- పీపీపీ - 56
- ఎంఎంఏ - 14
- బీఎన్‌పీ - 4
- జేడబ్ల్యూపీ - 1
- బీఏపీ - 4 (ఈ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అందులోని నలుగురు వ్యక్తులు ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించారు.)
- పీఎంఎల్‌క్యూ - 1 (ఈ పార్టీ కూడా ఇమ్రాన్ ప్రభుత్వాన్ని మద్దతుగా ఉంది. అయితే పీఎంఎల్‌క్యూ సభ్యుడు తారిక్ బషీర్ చీమా ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసి ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తానని ప్రకటించారు)
- స్వతంత్రులు - 4
మొత్తం - 169
మార్చి 31 సాయంత్రం 4 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 3న ఓటింగ్ చేపట్టనున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ బలపరీక్షలో గెలిచి ప్రభుత్వాన్ని కొనసాగిస్తారో లేదా క్లీన్ బౌల్ట్ అయ్యి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందో చూడాలి..! అయితే ఈ రాజకీయ అనిశ్చితిని ముగించేందుకు ఇమ్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'పుతిన్‌తో ముఖాముఖి జరిగితేనే యుద్ధానికి ముగింపు'