Russia Ukraine war: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్నవేళ... తమకు కంటిలో నలుసులా మారిన పోలాండ్, బల్గేరియాలకు రష్యా షాక్ ఇచ్చింది! ఉక్రెయిన్‌కు ఆయుధాలు చేరవేయడంలో కీలకంగా మారిన ఈ ఉభయ దేశాలకూ గ్యాస్ సరఫరాను నిలిపేసింది. ఇంతకీ మాస్కో ఎందుకీ నిర్ణయం తీసుకొంది? గ్యాస్ సరఫరాను నిలిపేస్తే రష్యాకు లాభమేంటి? ఐరోపాకు వచ్చే నష్టమేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ముందే జాగ్రత్తపడిన పోలాండ్: సహజవాయు ఒప్పందాల్లో డాలర్లు లేదా యూరోల్లో చెల్లింపులు జరపాలనే ఉంటుందని, ఇప్పటికిప్పుడు ఏకపక్షంగా చెల్లింపు విధానం మార్చడం కుదరదని యూరోపియన్ నేతలు అంటున్నారు. నిజానికి గజ్‌ప్రోమ్ నుంచి గ్యాస్ సరఫరా నిలిపివేత, దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు పోలండ్ ఎప్పట్నుంచో సిద్ధమవుతోంది. ఓడల ద్వారా ద్రవీకృత వాయువును దిగుమతి చేసుకునేందుకు ఇప్పటికే టెర్మినల్‌ను నిర్మించింది! గజ్‌ప్రోమ్‌తో సహజవాయు దిగుమతి ఒప్పందాన్ని ఈ ఏడాది చివరిలో రద్దు చేసుకోవాలని కూడా తలపోస్తోంది. బల్గేరియా కూడా తమ వద్ద సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రకటించింది.
రష్యాకూ ఇక్కట్లు?: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో గ్యాస్, ఇంధన వనరుల ఎగుమతులే మాస్కోకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. ఇవి నిలిచిపోతే రష్యాకు ఆర్థికంగా మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. అందుకే- "రష్యా కోరినట్టు రూబుల్‌లో చెల్లింపులు జరపవద్దు. అలా చేయడం ఈయూ ఆంక్షలను ఉల్లంఘించడమే అవుతుంది. గజ్‌ప్రోమ్‌తో ఒప్పందాలు చేసుకున్న సంస్థలు రష్యా కరెన్సీలో చెల్లింపులు జరపకూడదు" అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ దేర్ లేయెన్ బుధవారం హెచ్చరించారు.
2011-2020 మధ్య రష్యా ఆదాయంలో గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చింది ఏకంగా 43 శాతం! ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం సాగిస్తున్న మాస్కో నుంచి యూరోపియన్ సంస్థలు చమురు కొనడం చాలామందికి నచ్చడం లేదు. భారత్, చైనా వంటి దేశాలకు రష్యా ఓడల ద్వారా చమురును ఎగుమతి చేయగలదు. కానీ, పైపులైన్ వసతి లేనందున గ్యాస్‌ను మాత్రం సరఫరా చేయలేదు.
రాజకీయ ఉద్దేశంతోనే?: గ్యాస్ ఎగుమతులను పుతిన్ శాసించగలరని ప్రజలకు చూపే రాజకీయ ఉద్దేశంతోనే రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేత నిర్ణయం తీసుకుని ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న దేశాలను ఇరుకున పెట్టడమే పుతిన్ లక్ష్యమైతే, అందుకు ఈ చర్య సరిపోతుందని చెబుతున్నారు. హంగరీకి మాత్రం రష్యా ఇప్పటికీ గ్యాస్ సరఫరాను కొనసాగిస్తోంది. రష్యా విభజించు-పాలించు సిద్ధాంతాన్ని అనుసరిస్తోందనేందుకు ఇదే నిదర్శనమని... ఐరోపా సమాఖ్య కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తోందని బ్రసెల్స్‌లోని బ్రూగెల్ థింక్ ట్యాంక్ సంస్థలో సీనియర్ ఇంధన నిపుణుడు సీమోన్ టాగ్లియాపియోట్రా వ్యాఖ్యానించారు.
ఐరోపా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఇలా: రష్యా నుంచి చమురు, సహజవాయువు ఎగుమతుల్లో కోత పడితే... ఐరోపా మాంద్యంలోకి జారుకోవడం ఖాయమని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. జర్మనీకి రష్యా నుంచి ఇంధన సరఫరా నిలిచిపోతే... ఉత్పత్తిలో 5% కోతపడుతుందని, ధరలు విపరీతంగా పెరుగుతాయని హెచ్చరించారు. నిత్యావసరాలు, ఇంధన ధరలు మరింత ఎక్కువ అవుతాయన్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఐరోపా అసాధారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని బ్రుగెల్ థింక్ ట్యాంక్ పేర్కొంది. ఈ క్రమంలోనే- ఇంధన అత్యవసర పరిస్థితి ఏర్పడుతోందని జర్మనీ ప్రకటించడం గమనార్హం.
- రష్యా చర్యకు ఈయూ నేతలు దీటుగానే ప్రతిస్పందిస్తున్నారు. రష్యా గ్యాస్ వినియోగాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవీకృత గ్యాస్‌ను ఓడల ద్వారా తెప్పించుకోవడం... నార్వే, అజర్‌బైజాన్‌ల నుంచి పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరాను మెరుగుపరచుకోవడం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.
- రష్యా గ్యాస్ దిగుమతిని ఈ ఏడాది చివరినాటికి మూడింట రెండు వంతుల మేర తగ్గించాలని; 2027 నాటికి గ్యాస్ దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలని యూరోపియన్ భావిస్తున్నారు.
- రష్యా నుంచి 40% గ్యాస్ పొందుతున్న ఇటలీ... అల్జేరియా, అజర్‌బైజాన్, అంగోలా, కాంగో, కతార్‌ల నుంచి గ్యాస్ దిగుమతులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల ఆకృత్యాలు.. 400 లైంగిక దాడి కేసులు