Hiroshima Day : మానవ చరిత్రలో అతిపెద్ద మారణహోమాల్లో ఒకటైన జపాన్ నగరం హిరోషిమాపై బాంబు దాడి జరిగి ఆదివారానికి 78 ఏళ్లు పూర్తయ్యాయి. ఆగస్టు 6న హిరోషిమాపై, ఆగస్టు 9న నాగసాకిపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకుపైగా జపాన్ పౌరులను బలితీసుకున్నాయి. పెరల్ హార్బర్‌పై దాడికి ప్రతీకారంగా అణు దాడులతో జపాన్‌కు అమెరికా తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఆ మహావిషాదం తాలూకు చేదు జ్ఞాపకాలు నేటికీ జపాన్‌ను వెంటాడుతూనే ఉన్నాయి.
Hiroshima Nagasaki Bomb Name : పెరల్ హార్బర్‌పై 1941 డిసెంబర్ 7న జపాన్ దాడి చేయడం వల్ల రెండో ప్రపంచ యుద్ధం బరిలోకి అమెరికా దిగింది. ఈ యుద్ధం జపాన్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఐరోపాలో విజయం సాధించి జోరు మీదున్న అగ్రరాజ్యానికి లొంగిపోయేందుకు జపాన్ ఇష్టపడలేదు. దీంతో 1945 ఆగస్టు ప్రారంభంలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబులు వేయడానికి అమెరికా నిర్ణయించుకుంది. తొలుత 1945 ఆగస్టు 6న హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే అణ్వాయుధంతో అణుదాడి చేసింది. ఈ దాడిలో లక్షా 40వేల మంది మరణించారు. మరో మూడు రోజుల వ్యవధిలో ఆగస్టు 9న నాగసాకిపై ఫ్యాట్‌మ్యాన్ అనే మరో అణు బాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 70 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Hiroshima Nagasaki Bombing Reason : వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా మార్గాన్ని అన్వేషించింది. అందులో భాగంగా జపాన్‌పై పెద్ద ఎత్తున దండయాత్ర చేపట్టాలని తొలుత భావించింది. అయితే అందుకు పెద్ద సంఖ్యలో అమెరికా, జపాన్ ప్రజల జీవితాలను పణంగా పెట్టాల్సి రావడం వల్ల వెనకడుగు వేసినట్లు నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ హిస్టరీ క్యూరేటర్ జేమ్స్ స్టెమ్ తెలిపారు. తాము తయారు చేసిన అణ్వాయుధాన్ని పరీక్షించడమే కాకుండా భారీ నష్టాన్ని కలిగించేందుకు బాంబు దాడులు చేయాలని అమెరికా నిర్ణయించుకున్నట్టు వివరించారు. అణు బాంబులను ఉపయోగించడం ద్వారా జపాన్‌ను లొంగిపోయేలా చేయవచ్చని అమెరికా భావించినట్టు జేమ్స్ స్టెమ్ వెల్లడించారు.
Hiroshima Nagasaki Attack : అణుబాంబు పేలుళ్ల కారణంగా అప్పటికప్పుడు చాలా మంది మరణిస్తే.. మిగిలిన వారంతా రేడియేషన్ ప్రభావానికి గురై ప్రాణాలు విడిచారు. అమెరికా అణుదాడులకు అతలాకుతలమైన జపాన్ 1945 ఆగస్టు 15న లొంగిపోతున్నట్టు ప్రకటించింది. 1945 సెప్టెంబర్ 2న అందుకు సంబంధించి అధికారికంగా ధ్రువీకరణ పత్రాల మీద సంతకం చేసింది. 1948లో జపాన్ మాజీ ప్రధాని హిడెకి టోజోతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఇతర జపాన్ నాయకులకు వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్ జీవిత ఖైదు విధించింది.
జపాన్‌లో అణుదాడుల రేడియేషన్ ప్రభావం నేటికీ ఎంతోకొంత ప్రభావం చూపుతూనే ఉంది. ప్రస్తుతం అనేక దేశాలు అణు బాంబులు కలిగి ఉన్నాయి. అయితే జపాన్ బాంబు దాడులకు సంబంధించి హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు కనిపిస్తుండటం వల్ల వాటిని ఉపయోగించడానికి ప్రభుత్వాలు ఇష్టపడటంలేదు.
ఇవీ చదవండి : 'హిరోషిమా'కు 17 రెట్లు శక్తితో కొరియా అణుబాంబు