Hezbollah Fires Rockets At Israel : హమాస్ ఉప నేత సలేహ్ అరౌరీని హతమార్చిన ఇజ్రాయెల్‌పై లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్‌బొల్లా ప్రతీకార దాడులకు దిగింది. అరౌరీని లెబనాన్ రాజధాని బీరుట్‌లోనే హతమార్చడం వల్ల తమపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందన్న భావనతో ఎదురుదాడి చేసింది. శనివారం ఏకంగా 62 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా విరుచుకుపడింది. మౌంట్ మెరోన్పై ఉన్న గగనతల నిఘా స్థావరం వైపు 62 రాకెట్లను ప్రయోగించామని, అవి నేరుగా లక్ష్యాన్ని తాకాయని హెజ్‌బొల్లా ప్రకటించింది. రెండు సరిహద్దు ఔట్ పోస్టులపైనా దాడులు చేశామని తెలిపింది.
ఇస్లామిక్ గ్రూప్ కూడా దాడులు
మరోవైపు లెబనాన్ ఇస్లామిక్ గ్రూపు కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. శుక్రవారం రాత్రి కిర్యత్ ష్మోనాపై రాకెట్లతో దాడి చేశామని పేర్కొంది. అరౌరీపై దాడి చేసిన సమయంలో తమ గ్రూపునకు చెందిన ఇద్దరు ఫైటర్లు మరణించారని, అందుకు ప్రతీకారంగానే ఈ దాడి చేశామని తెలిపింది. మెరోన్ వైపు 40 రాకెట్లు వచ్చినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మౌంట్ మెరోన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బేస్ ఇజ్రాయెల్‌కు ఆక్రమిత పాలస్తీనాలో ఉన్న అతి కీలక స్థావరంగా ఉంది. అక్కడి నుంచే సిరియా, లెబనాన్, తుర్కియే, సైప్రస్‌తో పాటు మధ్యదరా సముద్ర ఉత్తర, తూర్పు బేసిన్ల వైపు ఆపరేషన్స్‌ను ఇజ్రాయెల్ నిర్వహిస్తుంటుంది.
మరో 122 మంది మృతి
గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 122 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 22,722కు చేరుకుందని వెల్లడించింది.
అందుకే దాడులు చేశాం! : హెజ్‌బొల్లా నాయకుడు
ఈ దాడుల గురించి ముందే హెజ్‌బొల్లా హెచ్చరికలు ఇచ్చింది. అరౌరీ మరణంపై హెజ్‌బొల్లా కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటుందని ఆ సంస్థ నాయకుడు సయ్యద్ సహన్ నస్రల్లా హెచ్చరించాడు. ఒకవేళ తాము తిరిగి దాడి చేయకపోతే, లెబనాన్ మొత్తం ఇజ్రాయెల్ దాడికి గురవుతుందని చెప్పారు. అంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఇజ్రాయెల్‌పై నస్రల్లా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ దాడులతో మధ్యప్రాశ్చంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ ప్రాంతానికి అత్యవసరంగా దౌత్య పర్యటన చేపట్టారు. అందులో భాగంగా శనివారం తుర్కియేలో పర్యటించారు. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్‌తో చర్యలు జరిపారు. యుద్ధానంతరం గాజా పునరుద్ధరణ కోసం సహకరించాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి నాటో సభ్య దేశమైన గ్రీస్ వెళ్లనున్నారు బ్లింకెన్.
ఇజ్రాయెల్‌కు షాక్! రాకెట్లతో హమాస్ ఎదురుదాడి- నెతన్యాహు దళాలు వెనక్కి!
డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత మృతి- దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దళాల విధ్వంసం