H1B quota increase : అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని దాదాపు 2,100 చిన్న, మధ్యశ్రేణి సంస్థలు భాగస్వాములుగా ఉన్న ఐటీ సేవల సంఘం వెల్లడించింది. నిపుణుల నియామకానికి వీసాల సంఖ్యను పెంచాలని బైడెన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 65 వేలుగా ఉన్న హెచ్-1బీ వీసాల కోటాను రెట్టింపు చేయాలని ఐటీ కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వీటిల్లో భారతీయులు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను నియమించుకొంటున్నాయి.
H1B quota per year : ఐటీ సర్వీస్ అనే అసొసియేషన్‌లోని 241 మంది సభ్యులు 'కాంగ్రెషనల్ అడ్వకసి డే' సందర్భంగా సమావేశమయ్యారు. నిపుణుల కొరత అంశాన్ని కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లకు తెలియజేయాలని నిర్ణయించారు. నిపుణుల కొరత తమ వ్యాపారం, అమెరికా అభివృద్ధిపై ప్రభావం చూపిస్తోందని వారు పేర్కొన్నారు. లక్షా 30 వేల హెచ్1బీ వీసాలు జారీచేయాలని కోరడం సహా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత(స్టెమ్) విద్యపై పెట్టుబడులు పెంచాలని కోరారు. ఫలితంగా స్థానికంగా నిపుణులను తయారు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
అమెరికాలోని 23 రాష్ట్రాల్లో తాము విస్తరించి ఉన్నామని, లక్షా 75 వేల ఉపాధి అవకాశాలు, నిపుణల ఉద్యోగాలను సృష్టించగలమని ఐటీ సర్వీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశ జీడీపీకి ఏటా 12 బిలియన్ డాలర్లు అందిస్తామని పేర్కొన్నారు. ఐటీ సర్వీస్ బృందం విజ్ఞప్తులకు అనుగుణంగా ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి.. 'హైస్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ ఫర్ ఎంప్లాయిమెంట్' చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం పోటీతత్వాన్ని పెంచి.. నిపుణుల కొరతను కూడా తీరుస్తుందని ఆయన వెల్లడించారు. దీంతోపాటు ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో స్టెమ్ విద్యపై వెచ్చించే మొత్తాన్ని పెంచనున్నారు. 'ఉద్యోగ సృష్టి, భవిష్యత్తు ఆర్థిక నిర్మాణం కోసం దేశీయ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులతో టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా ముందుండాలి. ప్రపంచంలో సృజనాత్మకత, టెక్నాలజీలో అమెరికా లీడర్‌గా ఉండాలి' అని రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
హెచ్1బీ వీసాలంటే?
H1B visa means in Telugu : అమెరికాలోని కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ ఉంటాయి. ఈ నియామకాలకు వీలు కల్పించేలా అమెరికా ప్రభుత్వం జారీ చేసే వీసాలను హెచ్1బీ అంటారు. ప్రధానంగా భారత్- చైనా వంటి దేశాల నుంచి నిపుణులను అమెరికా కంపెనీలు నియమించుకుంటాయి. అందుకోసం ఈ వీసాలపైనే ఆధారపడుతుంటాయి. ఈ వీసాల వల్ల వివిధ రంగాల్లోని నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి, పని చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకొని శాశ్వతంగా అమెరికాలో నివాసం ఉండవచ్చు.