Gaza Death Toll Today : హమాస్‌ను సమూలంగా నిర్మూలించేందుకు గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులను కొనసాగిస్తోంది. ఫలితంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటిదాకా గాజాలో 18,000 మంది మరణించారు. వీరిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో వైద్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. 23 లక్షల జనాభా గల గాజాలో ఉన్న మెుత్తం 36 ఆస్పత్రుల్లో 11 మాత్రమే పనిచేస్తున్నాయని, అవి కూడా పాక్షికంగానే సేవలందిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కేవలం 66 రోజుల్లోనే గాజా ఆరోగ్య వ్యవస్థ పతనావస్థకు చేరుకుందని తెలిపింది. ఉత్తర గాజాలో ఒకటి, దక్షిణ గాజాలో పది ఆస్పత్రులు పాక్షికంగా పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని అక్కడి వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 33 మంది పౌరులు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో 14 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతదేహాలను సెంట్రల్ గాజాలోని దైర్ అల్ బలాహ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలోనే మృతులకు వారి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
మా సైనికులను సొంత బలగాలే కాల్చాయి : ఇజ్రాయెల్
యుద్ధం మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చనిపోయిన తమ సైనికుల్లో పదిశాతం మంది ప్రమాదవశాత్తు మరణించారని ఇజ్రాయెల్ రక్షణ దళం(IDF) తెలిపింది. పొరపాటున సొంత బలగాలే వారిని కాల్చి చంపాయని వెల్లడించింది. ఇప్పటివరకు మెుత్తం 105 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించగా వారిలో 20 మంది ప్రమాదవశాత్తు మరణించారని పేర్కొంది. శత్రు సైన్యం అనుకొని పొరపాటున సొంత బలగాలే 13 మందిని హతమార్చినట్లు వెల్లడించింది. మరో ఏడుగురు హమాస్ ఉగ్రవాదులు పెట్టిన ల్యాండ్ మైన్స్ తొక్కడం వంటి వివిధ కారణాలతో మరణించినట్లు తెలిపింది.
కాల్పుల విరమణపై UNOలో ఓటింగ్, మద్దుతు తెలిపిన భారత్
మరోవైపు ఇజ్రాయెల్- హమాస్ యద్ధంలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. షరతులు లేకుండా అందరూ బందీలను విడుదుల చేయాలని కోరింది. 193 మంది సభ్యులున్న అసెంబ్లీలో 153 మంది కాల్పుల విరమణకు మద్దతుగా ఓటు వేయగా, 23 దేశాలు ఓటింగ్ దూరంగా ఉన్నాయి. మరో 10 దేశాలు వ్యతిరేకంగా వేశాయి.
గాజాలో తీవ్ర ఆహార కొరత- నీళ్ల కోసం ట్రక్కులు లూటీ- తుపాకీల మధ్య తరలింపు
7వేల మంది హమాస్ మిలిటెంట్లు హతం- గాజాలో 90 శాతం మందికి ఆహారం కరవు!