Gastric Problem To Fish : గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న ఓ చేపకు సరైన సమయంలో చికిత్స అందించి కాపాడారు వైద్యులు. అమెరికా కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరంలో జరిగిందీ ఘటన.
డెన్వర్‌లోని జంతు సంరక్షణశాలలో అనేక జీవులు ఉంటాయి. వాటిలోని ఓ చేపకు మాత్రం గత వారం అసాధారణ సమస్య వచ్చింది. ఈత కొట్టేందుకు ఆ చేప ఇబ్బంది పడింది. ఫ్రెంచ్ ఏంజెల్ఫిష్గా పిలిచే ఆ అందమైన మత్స్యం పడుతున్న అవస్థల్ని జూలో పని చేసే ఓ వ్యక్తి గుర్తించారు. బులుగు, పసుపు రంగుల్లో ఉండే ఆ చేప కాస్త ఉబ్బి ఉండడాన్ని, ఈత కొట్టేటప్పుడు పక్కకు ఒరగడాన్ని ఆ ఉద్యోగి గమనించారు. ఏదో తేడాగా ఉందని అనుకుని చేపను జాగ్రత్తగా పట్టుకున్నారు. డెన్వర్ జంతు సంరక్షణశాలలోనే ఉండే ఆస్పత్రి వైద్యుల దగ్గరకు ఆ ఫ్రెంచ్ ఏంజెల్ ఫిష్‌ను తీసుకెళ్లారు.
చేపను డెన్వర్ జూ వైద్యులు నిశితంగా పరిశీలించారు. సమస్య ఏంటో తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కానీ వారికి ఓ సమస్య వచ్చింది. జూలో ఉన్న సీటీ స్కాన్ యంత్రం చాలా పెద్దది. ఏకంగా 318 కిలోల వరకు బరువు ఉండే ఎలుగుబంటికి కూడా వైద్య పరీక్షలు చేసేందుకు ఆ యంత్రాన్ని ఉపయోగించవచ్చు. అలాంటిదానితో ఇప్పుడు 7 అంగుళాల చేపకు సీటీ స్కాన్ చేయాల్సి వచ్చింది. అందుకే వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న చేపకు ముందుగా వైద్యులు మత్తు మందు ఇచ్చారు. ఒక స్పాంజ్‌పై జాగ్రత్తగా పడుకోబెట్టారు. పరీక్ష జరుగుతున్నంత సేపు ఆ చేపపై నీళ్లు పోస్తూ.. దానికి ఏమీ కాకుండా చూసుకున్నారు. అల్ట్రా సౌండ్, సీటీ స్కాన్ పరీక్షల ఫలితాలు విశ్లేషించిన వైద్యులకు అసలు సమస్య ఏంటో తెలిసింది. ఎంటెరైటిస్తో ఆ చేప బాధపడుతున్నట్లు గుర్తించారు. అంటే.. గ్యాస్ట్రిక్ సమస్య. పేగుల్లో గ్యాస్ పేరుకుపోవడం వల్ల ఆ చేప నీటిలో తేలే విషయంలోనూ మార్పులు వచ్చాయి. అందుకే ఈత కొట్టేందుకు ఇబ్బంది పడింది. "ఆ చేపకు వైద్యులు యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఇప్పుడు దాని పరిస్థితి బాగానే ఉంది. ఎప్పటిలానే ఈత కొడుతోంది" అని డెన్వర్ జూ అధికార ప్రతినిధి జేక్ కూబీ తెలిపారు.