Gas Cylinder Explosion In Pakistan : గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మూడంతస్తుల భవనం కుప్ప కూలి ఆరుగురు మృతి చెందారు. మరో 10 గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఆదివారం ఉదయం 9.45 గంటలకు జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం గ్రాండ్ ట్రంక్ రోడ్లో ఉన్న ఓ హోటల్లోని వంట గదిలో సిలిండర్ పేలింది. దీంతో మూడు అంతస్తుల భవంతి కుప్పకూలింది. ప్రమాద సమయంలో శిథిలాలు మీద పడి ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జీలం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విధించి మొత్తం సిబ్బంది, వైద్యులను విధుల్లోకి చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో క్షతగాత్రుడిని రావల్పిండిలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
ఈ మేరకు జీలం డిప్యూటీ కమిషనర్ సమీవుల్లా ఫరూక్ వివరాలు వెల్లడించారు. 'మా సహాయక బృందాలు రెస్క్యూ చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద నలుగురైదుగురు వ్యక్తులు ఉండవచ్చు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది' అని సమీవుల్లా తెలిపారు. శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలను వినియోగిస్తున్నట్లు జీలం పోలీసులు తెలిపారు.
పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న వరదలు..
Pakistan Floods : పాకిస్థాన్‌ను మరోసారి వరదలు ముంచెత్తున్నాయి. గతేడాది వరదల నుంచే ఇప్పటికీ కోలుకోలేక.. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న దాయాది దేశంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా గత రెండు వారాలుగా ఇప్పటివరకు 76 మంది ప్రాణాలు కోల్పోగా.. 133 మందికి గాయాలైనట్లు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇందులో గడిచిన 24 గంటల్లోనే తొమ్మిది మంది చనిపోయినట్లు చెప్పినట్లు పాక్ మీడియా తెలిపింది.
నెలరోజులుగా కురుస్తున వర్షాలకు అనేక ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. కేవలం పంజాబ్ ప్రావిన్సులోనే ఇప్పటివరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్సులో 20 మందితోపాటు బలోచిస్థాన్‌లో ఐదుగురు చనిపోయినట్లు ఎన్‌డీఎంఏ వెల్లడించింది. జులై 8న ఒక్కరోజే 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. జులై 3 నుంచి 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని.. కొండచరియలు విరిగిపడి.. వరదలకు దారితీస్తాయని ముందుగానే హెచ్చరించినట్లు ఎన్‌డీఎంఏ పేర్కొంది.