ఉక్రెయిన్‌పై సైనికచర్య సందర్భంగా స్వాధీనం చేసుకున్న దొనెత్స్క్ , లుహాన్స్క్ , జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయి. క్రెమ్లిన్ లో జరిగిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో విలీనమైందని తెలిపారు. విలీన ఒప్పందంపై దొనెత్స్క్ , లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలకు చెందిన అధినేతలు సంతకాలు చేశారు. అయితే, పుతిన్ చేసిన ప్రకటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. ప్రకటన పనికిరానిదని.. వాస్తవాలను ఎవరూ మార్చలేరని అన్నారు.
ఈనెల 23 నుంచి 27 వరకు నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు విలీనానికి మద్దతు తెలిపినట్లు మాస్కో ప్రకటించింది. జపోరిజియాలో 93శాతం, ఖేర్సన్ లో 87 శాతం, లుహాన్స్క్ లో 98 శాతం, దొనెత్స్క్ లో 99శాతం మంది ప్రజలు రష్యాలో విలీనానికి అనుకూలంగా ఓటేసినట్లు మాస్కో వెల్లడించింది. ఉక్రెయిన్ భూభాగంలో ఈ నాలుగు ప్రాంతాల వాటా 15 శాతంగా ఉంది. అయితే రష్యా నిర్వహించిన రెఫరెండంను బూటకమని ఉక్రెయిన్ , అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు పేర్కొన్నాయి. ఆ ఫలితాలను గుర్తించేది లేదని తేల్చిచెప్పాయి.
నాటో దళాలు అడుగు కూడా..
రష్యా విలీనం చేసుకున్న ఆ నాలుగు భూభాగాల్లో నాటో దళాలు ఇక అక్కడ అడుగు పెట్టలేవు. ఒకవేళ అందుకు విరుద్ధంగా జరిగితే మాత్రం.. పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారిపోతుంది. అది అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మరింత ముదిరితే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటలు నిజం కావచ్చు. విలీన ప్రకటన తర్వాత రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు అత్యంత కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు తమ గడ్డ నుంచి చివరి రష్యన్ సైనికుడిని తరిమేసేంత వరకు విశ్రమించబోమని ఉక్రెయిన్ తెగేసి చెబుతోంది. తమ భూభాగంపై రష్యా ఆధిపత్యాన్ని ససేమిరా సహించబోమని చెప్పింది. మాస్కోపై పోరాడేందుకు ఆయుధాలు ఇవ్వాలంటూ పశ్చిమ దేశాలను కోరుతోంది. ఈ పరిణామాలు ఎటువైపునకు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
ఇవీ చదవండి: H1B వీసాదారులకు గుడ్‌న్యూస్.. ఇక అమెరికాలోనూ స్టాంపింగ్!
అమెరికాపై 'ఇయాన్' పంజా.. అనేక ఇళ్లు ధ్వంసం.. 27 లక్షల మందికి పవర్ కట్