అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో 250 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిన నలుగురు కారు ప్రయాణికుల్ని అధికారులు రక్షించారు. అందులో నాలుగేళ్ల చిన్నారి, తొమ్మిదేళ్ల బాలుడితో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పసిఫిక్ తీరంలోని అతి ప్రమాదకరమైన డెవిల్స్ స్లైడ్ రహదారి మీద ఈ ప్రమాదం జరిగింది.
పర్వత ప్రాంత రహదారి వెంట ప్రయాణిస్తున్న టెస్లా సూడాన్ కారు అదుపు తప్పి 250 అడుగుల లోతులో పడింది. భూమిని చేరే లోపే.. ఆ కారు అనేక సార్లు పల్టీలు కొడుతూ, పర్వత శిఖరాలను ఢీకొట్టింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి అగ్నిమాపక దళాలకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది కారులో ఉన్నవారు మృతి చెంది ఉంటారని భావించారు. మృతదేహాలను బయటకు తీయాలని ఆపరేషన్ మొదలుపెట్టారు. అంతలోనే వారు బతికి ఉన్నారని తెలియడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. తాడు సాయంతో వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


