England 7 Minute Cancer Treatment : క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్న బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అలాంటి వారికి ఇంగ్లాండ్ పరిశోధకులు శుభవార్త చెప్పారు. క్యాన్సర్‌ను నియంత్రించడానికి అందించే చికిత్స విధానంలో కీలక పురోగతి సాధించారు. ఇంగ్లాండ్‌లోని క్యాన్సర్ రోగులకు ఇచ్చే ఇంజెక్షన్ (England Cancer Treatment Injection) సమయాన్ని తగ్గించే.. సరికొత్త ఆవిష్కరణకు ఆ దేశ నేషనల్ హెల్త్ సర్వీస్- ఎస్హెచ్ఎస్ ఆమోదం లభించింది. దీంతో ఈ ఔషధాన్ని కేవలం 7 నిమిషాల్లోనే క్యాన్సర్ రోగికి ఎక్కించవచ్చని ఎన్‌హెచ్‌ఎస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, గతంలో ఈ ఔషధాన్ని ఎక్కించేందుకు 30 నిమిషాల నుంచి గంట వ్యవధి పట్టేది. క్యాన్సర్ పేషెంట్లకు తక్కువ సమయంలోనే ఇంజెక్షన్‌ను అందించే తొలి దేశం తమదేనని తెలిపింది.
ఈ క్యాన్సర్ ఔషధానికి ఇంగ్లాండ్‌లోని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ- ఎమ్హెచ్ఆర్ఏ ఆమోదం తెలిపినట్లు ఎన్‌హెచ్‌ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఔషధం రోగులకు ఉపయోగపడటమే కాకుండా ఎక్కువ మంది బాధితులకు తక్కువ సమయంలో చికిత్స చేయోచ్చని.. సమయం ఆదా అవుతందని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది. ఇంగ్లాండ్‌లో క్యాన్సర్ బాధితులకు ఇమ్యునోథెరపీలో (Immunotherapy England) భాగంగా అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను చర్మం కింద నుంచి నేరుగా సిరల్లోకి ఎక్కిస్తారు. ఇందుకు ప్రస్తుతం 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతోంది. తాజాగా ఆమోదించిన ఔషధాన్ని కేవలం ఏడు నిమిషాల్లోనే ఎక్కించవచ్చు.
ఇంగ్లాండ్‌లో ఏటా దాదాపు 3600 మంది అటెజోలిజుమాబ్ చికిత్స పొందుతున్నారు. అయితే అందులో ఎక్కువ శాతం మంది తాజా ఔషధం వైపు మళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటెజోలిజుమాబ్ అనేది ఇమ్యునోథెరపీ (atezolizumab mechanism of action) ఔషధం. ప్రస్తుతం రక్తమార్పిడి ద్వారా అందించే ఈ ఔషధం.. క్యాన్సర్ కణాలను వెతికి నాశనం చేయడంతో పాటు రోగనిరోధక వ్యవస్థకు మరింత శక్తిని సమకూరుస్తుంది. ఇంగ్లాండ్‌లో ఊపిరితిత్తులు, రొమ్ము, కాలేయం, మూత్రాశయ క్యాన్సర్లతో బాధపడుతున్న రోగులకు ప్రస్తుతం ఈ ఔషధాన్ని అందిస్తున్నట్టు ఎన్‌హెచ్‌ఎస్ తెలిపింది.