Egypt Car Accident : హైవేపై అనేక కార్లు, బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో 32 మంది మరణించగా.. మరో 63 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగింది. ప్రమాదం అనంతరం కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగాయని ఈజిప్ట్ ఆరోగ్య శాఖ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
కైరో నుంచి అలెగ్జాండ్రియా నగరాన్ని కలిపే హైవేపై 10 కార్లు, మూడు ప్యాసింజర్ బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో ఓ కారు నుంచి ఆయిల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఇంతలో చూస్తుండగానే అవి మిగతా వాహనాలకు వ్యాపించినట్లు అధికారులు వివరించారు. మృతుల్లో పలువురు వాహనాల్లోనే సజీవ దహనమైనట్లు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.