Earthquake In Delhi Today : పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రాత్రి పది గంటల 20 నిమిషాల సమయంలో 6.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించినట్టు పాకిస్థాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం తెలిపింది. అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వివరించింది. భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్, రావల్పిండి సహా వివిధ నగరాల్లో ప్రకంపనలు సంభవించినట్టు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ విపత్తులో ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో 9 మంది చనిపోగా 120 మందికి పైగా గాయపడ్డారు. ఆస్తి నష్టంపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం వెలువడలేదు.
భూకంపం కారణంగా భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. దిల్లీ, జమ్ముకశ్మీర్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రత నమోదైంది. ప్రకంపనల ధాటికి భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూకంప ప్రభావానికి జమ్మూలో పలు చోట్ల ఇంటర్నెట్కు అంతరాయం కలిగింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలకొరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఇస్లామాబాద్ ఆస్పత్రుల్లో ఎమర్జేన్సీ ప్రకటించారు. వైద్యులంతా అప్రమత్తంగా ఉండాలని ఫెడరల్ మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ స్పష్టం చేశారు. భూకంపం సంభవించిన అనంతరం పలు ప్రాంతాల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. రావల్పిండిలోని మార్కెట్లలో తొక్కిసలాట జరిగింది. భయంతో ప్రజలు పరుగులు పెట్టడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
74వేల మంది మృతి!
పాకిస్థాన్‌లో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. ఈ ఏడాది జనవరిలోనూ అక్కడ భూకంపం వచ్చింది. 6.3 తీవ్రతతో ఆ భూకంపం సంభవించింది. 2005 లో మాత్రం అతి తీవ్రమైన భూకంపం పాక్‌ను వణికించింది. ఆ ఘటనలో పాకిస్థాన్‌లో 74 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఇటీవల తుర్కియే, సిరియాలను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 57,300 మందికి పైగా ఈ భూకంపంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక్క తుర్కియాలోనే 50 వేల మందికి పైగా కన్నుమూశారు. సిరియాలో 7,300 మందికి పైగా మరణించారు. ఆధునిక యుఘంలో తుర్కియేలో సంభవించిన ఘోర భూకంపం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు.