nepal plane crash: నేపాల్‌లో 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. విమాన శకలాల నుంచి 14 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. సన్సోవారో సమీపంలో విమాన శకలాలను సహాయక బృందాలు గుర్తించాయి. చిన్న హెలికాప్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఆదివారం విమానం కూలిందని భావించిన ప్రదేశంలో మంచు కురిసిన కారణంగా.. శోధన, సహాయక చర్యలను నిలిపివేశారు. సోమవారం తిరిగి ప్రారంభించి శకలాలను గుర్తించారు. అయితే విమానంలోని ఏ ఒక్కరూ బతకలేదని, మొత్తం 22 మంది చనిపోయారని నేపాల్ మీడియా తెలిపింది.
నేపాల్ తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం.. ఆదివారం ఉదయం గల్లంతైంది. గల్లంతైన వారిలో నలుగురు భారతీయులు కాగా వీరిని ముంబయికి చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి, అతడి భార్య వైభవి బండేకర్, పిల్లలు ధనుశ్, రితికగా గుర్తించారు. వీరితో పాటు ముగ్గురు జపనీయులు సహా మొత్తం 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్ వెళ్తుండగా విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో లేటే ప్రాంతానికి చేరుకున్న అనంతరం.. విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: భారీ పేలుడు శబ్దం.. విమానం మాయం.. 22 మంది పరిస్థితి?