China Zero Covid Policy : కరోనా వైరస్ కట్టడికి చైనా అవలంబిస్తోన్న జీరో కొవిడ్ విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొవిడ్ ఆంక్షల కారణంగా లక్షల మంది ఇళ్లకే పరిమితం కావడం, కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లోనూ వారిని బయటకు వెళ్లనీయకపోవడంపై అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా క్వారంటైన్‌లో ఉన్న ఓ చిన్నారికి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడం పౌరుల మరింత ఆగ్రహానికి కారణమయ్యింది. ఇలాగే ఇటీవలే ఓ మూడేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన మరవకముందే తాజాగా నాలుగు నెలల పాప చనిపోవడంపై అక్కడి ప్రభుత్వంపై చైనీయులు మండిపడుతున్నారు.
చైనాలోని ఝేంగ్‌జువా నగరంలోని లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. లక్షల మంది ఇళ్లకే పరిమితం కాగా.. లక్షణాలున్నవారిని నగరానికి దూరంగా ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. ఇలాగే ఓ కుటుంబం నగరానికి దూరంగా ఉన్న హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంది. ఈ క్రమంలోనే వారి నాలుగు నెలల పాపకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసర వైద్యం కోసం ప్రయత్నించారు. కానీ, కొవిడ్ ఆంక్షల కారణంగా అధికారులు బయటకు వెళ్లేందుకు అంగీకరించలేదు. సుమారు 11 గంటల పాటు ప్రాధేయపడిన అనంతరం 100 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించారు. కానీ, అప్పటికే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి చివరకు ప్రాణాలు కోల్పోయింది.
లాంఝువా నగరంలోనూ ఇటీవల ఈ తరహా ఘటనే జరిగింది. క్వారంటైన్‌లో ఉన్న మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురయ్యింది. ఆసుపత్రికి వెళ్లేందుకు చిన్నారి తండ్రి ప్రయత్నించినప్పటికీ అధికారులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించి ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి కారణం ఆరోగ్య కార్యకర్తలేనని బాలుడి తండ్రి ఆరోపించడం వల్ల.. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల ప్రవర్తనను నిరసిస్తూ బారికేడ్లను దాటుకోవడం సహా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, క్వారంటైన్‌లో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలిగించమని ప్రకటించారు. అయినప్పటికీ తాజాగా మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం పట్ల చైనీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.