China Zero Covid Policy : కరోనా కట్టడికి చైనా అమలు చేస్తున్న జీరో కొవిడ్ విధానాలపై ప్రజాగ్రహం పెల్లుబికిన వేళ ఆ దేశ అధికారులు వెనక్కి తగ్గారు. గ్వాంగ్జౌ సహా పలు నగరాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. గ్వాంగ్జౌ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెల రోజులుగా ఇళ్లకే పరిమితమైన గ్వాంగ్జౌ పరిధిలోని 18లక్షల మంది ప్రజలు నిబంధనల సడలింపుతో బయటకు వస్తున్నారు. ఆంక్షల్లో భాగంగా రోడ్లపై ఏర్పాటు చేసిన బారిగేడ్లను అధికారులు తొలగిస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఎత్తివేయడం సహా ఇండోర్ డైనింగ్‌కు అనుమతిస్తుండడం వల్ల రెస్టారెంట్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. పలు మాల్స్ కూడా వినియోగదారులతో దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు క్యూలతో కనిపించిన నగరంలోని కరోనా పరీక్షా కేంద్రాలు, ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. కొత్తగా 6,312 కొవిడ్ కేసులు బయటపడినప్పటికీ నిబంధనల సడలింపుతో ప్రజలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. గ్వాంగ్జౌ నగర మెట్రో గతంతో పోలిస్తే ప్రయాణికులతో సందడిగా కనిపిస్తోంది.
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డ్రాగన్ ప్రభుత్వం ఆంక్షల సడలిస్తుండడంపై చైనీయుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వర్గం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, కనీసం ఒక వ్యాక్సిన్ కూడా తీసుకోని వ్యక్తులు.. ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బీజింగ్‌కు చెందిన ఓ వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతున్న తన 80ఏళ్ల తల్లి గురించి ఆందోళన చెందుతున్నారు. 3వారాలకు ఒకసారి తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని, బయట కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వాపోయారు. గ్వాంగ్జౌలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకురాలు 41ఏళ్ల లిలి అనే మహిళ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. లాక్‌డౌన్ వల్ల తమ ఆదాయం 30శాతం మేర తగ్గిందని, ఆంక్షల సడలింపుతో.. ఊపిరి పీల్చుకుంటున్నట్లు పేర్కొంది.