China Foreign Minister News : చైనా విదేశాంగ మంత్రిగా వాంగ్ యీ మరోసారి ఎన్నికయ్యారు. గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మంత్రి కిన్ గాంగ్ స్థానంలో వాంగ్ యీని నియమించినట్లు స్థానిక మీడియా తెలిపింది. దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వాంగ్‌ను నియమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. "విదేశాంగ మంత్రిగా వాంగ్ యీ నియామకానికి దేశ అత్యున్నత చట్టసభ ఆమోదం తెలిపింది" అని మీడియా పేర్కొంది. అయితే, కిన్ను తొలగించడానికి గల కారణాన్ని వెల్లడించలేదు. కాగా కిన్ గాంగ్ ఎక్కడ ఉన్నారనే విషయపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఆయన గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పడం గమనార్హం.
China Foreign Minister Missing : కిన్ గాంగ్ గతేడాది డిసెంబరులో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అమెరికాలో చైనా రాయబారిగా ఉన్న ఆయనకు.. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా పదోన్నతి కల్పించారు. అయితే గత కొన్ని రోజులుగా కిన్ గాంగ్ ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో కనిపించట్లేదు. గత నెల 25న రష్యా, శ్రీలంక, వియత్నాం ప్రతినిధుల సమావేశంలో చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో కిన్ కనిపించలేదు. అయితే విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ఆయన అమెరికన్లపై ప్రశంసలు కురిపించడం అప్పట్లో వైరల్ అయ్యింది.
ఆసియాన్ సమావేశానికి సైతం గాంగ్ హాజరుకాలేదు. దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ.. అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని అప్పట్లో వెల్లడించింది. గాంగ్ స్థానంలో చైనా కీలక దౌత్యవేత్త, ప్రస్తుతం మంత్రిగా నియమితులైన వాంగ్ యీనే విదేశాంగ శాఖ బాధ్యతలను సమీక్షించినట్లు సమాచారం. అప్పట్లో జరిగిన ఆసియాన్ సదస్సుకు వాంగ్ యీనే చైనా తరఫున హాజరయ్యారు. అంతకుముందు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తోనూ ఆయనే భేటీ అయ్యారు.
పెళ్లి చేసుకుంటున్నారా..?
మరోవైపు గాంగ్ గురించి ఆన్‌లైన్‌లో అప్పట్లో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అమెరికా పౌరురాలైన టీవీ జర్నలిస్టు ఫు షియోటియాన్‌తో గాంగ్ ప్రేమలో ఉన్నట్లు చైనీస్ మీడియాలో కథనాలు వచ్చాయి. హాంకాంగ్‌కు చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న ఆమెను.. కిన్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని, ఆ పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నారని సదరు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ వదంతులపై చైనా ప్రభుత్వం స్పందించలేదు.
చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా పాన్
మరోవైపు, చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా పాన్ గాంగ్షెంగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్న్‌గా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పించింది అధికార కమ్యూనిస్టు పార్టీ. ఆయన నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పింది.
ఇవీ చదవండి : పాకిస్థాన్‌లో జాక్‌మా సీక్రెట్ టూర్.. చైనాకు సమాచారం ఇవ్వకుండానే మీటింగ్స్!
చైనాలో అమెరికా వృద్ధ సింహం.. జిన్‌పింగ్‌తో వందేళ్ల కిసింజర్ భేటీ.. అంతరార్థమేంటో?