చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. 96 ఏళ్ల జియాంగ్, షాంఘైలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు, చైనా మీడియా వెల్లడించింది. అటు చైనా పాలకమండలి, పార్లమెంటు, కేబినెట్, సైన్యం సైతం జియాంగ్ మరణాన్ని ధ్రువీకరిస్తూ లేఖలు విడుదల చేశాయి. జియాంగ్ మరణం తమకు తీరని లోటని అన్ని జాతుల ప్రజలకు తీవ్ర దుఖాన్ని మిగిల్చిందని లేఖలో పేర్కొన్నారు.
1989లో తియానన్మెన్ నిరసనల అణచివేత తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీని నడిపించే బాధ్యతలు స్వీకరించారు జియాంగ్. అనంతరం దేశంలో చారిత్రక మార్పులకు నాంది పలికారు. ఆర్థిక వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. బ్రిటష్ పాలన నుంచి హాంకాంగ్‌కు విముక్తి లభించడం, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోకి చైనా ప్రవేశించడం వంటివి జియాంగ్ పాలనలో జరిగాయి. అయితే, దేశంలో మాత్రం అసంతృప్తులను ఉక్కుపాదంతో అణచివేశారు. శ్రామిక, ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలను, మానవ హక్కుల ఉద్యమకారులను జైళ్లలో నిర్బంధించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఏకఛత్రాధిపత్యానికి ముప్పుగా పరిణమిస్తుందనే భయంతో ఫాలున్ గోంగ్ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని అణచివేశారు.
2004లో చైనా కమ్యూనిస్టు పార్టీలో అధికారిక పదవులన్నీ వదులుకున్నారు జియాంగ్. అయితే, ఆ తర్వాత పార్టీలో చెలరేగిన వర్గ పోరును వెనక నుంచి నడిపించారు. ఈ పరిణామాల మధ్యే ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2012లో బలమైన నేతగా ఎదిగారు. ఈయన సైతం.. జియాంగ్ ఆర్థిక సంస్కరణలు, కఠిన రాజకీయ పంథాను అనుసరిస్తున్నారు.