కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మరోసారి కొవిడ్ కోరలు చాస్తోంది. ఆ దేశంలో శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు వెలుగుచూడటం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే వీరిలో అందరికీ లక్షణాలు ఏమీ లేవని అక్కడి అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించి జీరో కొవిడ్ వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నప్పటికీ కేసులు అదుపులోకి రావడం లేదు. కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడంతో రాజధాని బీజింగ్‌లోని పార్కులను మూసివేశారు. దేశవ్యాప్తంగా మరోసారి కఠిన ఆంక్షలను విధిస్తున్నారు.
గ్వాంగ్‌జౌ, చాంగ్‌కింగ్ నగరాల్లో దాదాపు 50 లక్షలమంది కఠిన లాక్‌డౌన్ ఆంక్షల మధ్య ఉన్నారు. రాజధాని బీజింగ్‌లో 118 కొత్త కేసులు వెలుగుచూడటంతో అక్కడ ఉన్న 2.10 కోట్ల మందికి రోజువారీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలన్నీ ఆన్‌లైన్ తరగతులకే పరిమితమయ్యాయి. ఆస్పత్రులు అత్యవసర సేవలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడి.. అందులో పనిచేసే సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆంక్షలు తట్టుకోలేని కొంతమంది చైనా ప్రజలు.. పోలీసులు, వైద్యసిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జీరో కొవిడ్ వ్యూహంతో లక్షలాది మంది ఇళ్లకే పరిమితం కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ఆంక్షలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరాశపై స్పందించిన చైనా నాయకులు వారికి హామీ ఇచ్చారు. కేసులు భారీగా ఉన్న నగరాలు మినహాయించి.. మిగతా నగరాల్లో ఉన్నవారిని నిర్బంధం నుంచి విడిచిపెడతామని చెప్పారు.