China children internet limit : చిన్నారులు స్మార్ట్‌ఫోన్ వాడడంపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు చైనా సిద్ధమైంది. మైనర్లు రోజుకు గరిష్ఠంగా రెండు గంటలు మాత్రమే స్మార్ట్‌ఫోన్ వినియోగించేలా నిబంధనలు రూపొందించింది. చైనా అంతర్జాల నియంత్రణ సంస్థ అయిన సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా.. బుధవారం ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. మైనర్లు రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య ఇంటర్నెట్లోని చాలా వరకు సేవలను మొబైల్లో పొందకుండా నిబంధన విధించింది. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు.. రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని తెలిపింది. 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ఇంటర్నెట్ వినియోగించుకునే సమయాన్ని గంటకే పరిమితం చేసింది. ఎనిమిదేళ్ల లోపు వారికైతే 40 నిమిషాలు మాత్రమే అంతర్జాలం వాడుకోవచ్చని పేర్కొంది.
వాటికి మినహాయింపు..
Chinese internet limit : ఈ ఆంక్షల నుంచి కొన్ని సర్వీసులకు మినహాయింపులు ఇచ్చింది చైనా. మైనర్ల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్స్, ప్లాట్‌ఫామ్‌లకు ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది. అయితే, నిర్దిష్టంగా ఏఏ సేవలు ఇంటర్నెట్ ఆంక్షలను తప్పించుకుంటాయనే విషయాన్ని సీఏసీ వెల్లడించలేదు.
China limits online gaming to 3 hours : దేశంలోని చిన్నారులు ఇంటర్నెట్కు బానిసలుగా మారిపోయారని చైనా భావిస్తోంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే తీసుకున్న అనేక చర్యలకు కొనసాగింపుగా తాజా నిబంధనలు రూపొందించింది. ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే విషయంలోనూ చైనా ఆంక్షలు విధించింది. చిన్నారులు పగటి పూట ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకే పరిమితం చేస్తూ 2019లో ఆంక్షలు విధించింది. శుక్ర, శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలీడేలలో ఈ సమయాన్ని గంటకు పరిమితం చేస్తూ 2021లో నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లలో 'యూత్ మోడ్'ను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంది. చిన్నారులకు.. వారి వయసుకు తగిన కంటెంట్ వచ్చేలా రూల్స్ తీసుకొచ్చింది. యూత్ మోడ్ ప్రవేశపెట్టిన తర్వాత.. సానుకూల ఫలితాలు వచ్చాయని సీఏసీ వెల్లడించింది. చిన్నారులు.. మొబైల్స్‌కు అతుక్కుపోవడం తగ్గిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా ముసాయిదా నిబంధనలపై సెప్టెంబర్ 2లోపు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని ప్రజలను కోరింది.
సీఏసీ తీసుకొచ్చిన ఈ ఆంక్షలు షార్ట్-వీడియో, ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్‌లతో పాటు గేమింగ్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చైనాలోని అతిపెద్ద గేమ్ కంపెనీ అయిన టెన్సెంట్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ బైట్‌డాన్స్ వంటి కంపెనీలను ఈ నిబంధనలు ప్రభావితం చేయనున్నాయి. ఈ నిబంధనలు అమలు చేసే బాధ్యత చైనా కంపెనీలపైనా ఉంటుంది. ఇప్పటికే కొన్ని షార్ట్-వీడియో ప్లాట్‌ఫామ్‌లు చిన్నారుల కోసం యూత్ మోడ్‌లను తీసుకొచ్చాయి. చిన్నారులకు చూపించే కంటెంట్, సమయంపై నియంత్రణలు పాటిస్తున్నాయి. సైన్స్ ప్రయోగాలు వంటి విద్యాపరమైన కంటెంట్‌ను చిన్నారులకు పుష్ చేస్తున్నాయి.