Bus Fire In Pakisthan : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ బస్సు.. డీజిల్ డ్రమ్ములతో వెళ్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 18 మంది ప్రయాణికులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. పిండి భట్టియాన్ ప్రాంతంలోని ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Pakistan Bus Fire : ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 35 నుంచి 40 మంది ప్రయాణికులతో బస్సు.. కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు వెళ్తోందని పోలీసు అధికారి డాక్టర్ ఫహద్ తెలిపారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రెండు వాహనాల డ్రైవర్లు మరణించారని వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. బస్సు కిటికీలు పగలగొట్టి కొందరు ప్రయాణికులను కాపాడారు.
"పిండి భట్టియాన్ ప్రాంతంలో ఆదివారం వేకువజామన.. డీజిల్ డ్రమ్ములను తీసుకెళ్తున్న వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. వెంటనే రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. కాలిన గాయాలతో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించాం. వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బస్సులో నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ నిద్రపోయాడా లేదా అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. మరణించిన వారి వివరాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా నిర్ధరిస్తాం. అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తాం" అని ఐజీ ఖవాజా తెలిపారు.
ఈ ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారిని ఉత్తమ చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బస్సు బ్రేక్ ఫెయిల్.. 13 మంది మృతి
Pakisthan Bus Overturned : కొద్దిరోజుల క్రితం.. పంజాబ్ ప్రావిన్స్‌లోనే బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 3 చిన్నారులు, ఐదుగురు మహిళలతో సహా 13 మంది మృతిచెందారు. 25 మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓ బస్సు 34 మంది ప్రయాణికులతో లాహార్ నుంచి రావల్పిండి వెళ్తోంది. కల్లార్ కహర్ సాల్ట్ రేంజ్ వద్ద బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల హైవేపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు.