బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతున్న సెక్స్ కుంభకోణం బోరిస్ జాన్సన్ సర్కార్ పుట్టి ముంచింది. ఆయన పదవి నుంచి తప్పుకోవాలంటూ ఇంటాబయటా డిమాండ్లు రోజురోజుకు తీవ్రం కాగా.. పదవి నుంచి వైదొలగక తప్పలేదు. ప్రజాతీర్పు గౌరవించి ముందుకు సాగనున్నట్లు నిన్న ప్రతినిధుల సభలో బోరిస్ జాన్సన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. పదవీ గండం నుంచి తప్పించుకోలేకపోయారు. కేబినెట్ నుంచి ఒక్కో మంత్రి తప్పుకున్న నేపథ్యంలో చివరకు బోరిస్ జాన్సన్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి ఒంటి చేత్తో అఖండ మెజార్టీ సాధించి పెట్టిన బోరిస్ జాన్సన్.. పార్టీలో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. తనకు పార్టీలో, ప్రభుత్వంలో ఎదురేలేదన్న అతివిశ్వాసం కొంపముంచింది. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస వివాదాల్లో చిక్కుకుని.. మంత్రులు, ఎంపీల్లో విశ్వాసం కోల్పోయారు. ఆయనపై విశ్వాసం లేదంటూ 40మందికిపైగా మంత్రులు, 60 మందికిపైగా ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. ప్రధానంగా ఐదు వివాదాలు బోరిస్ జాన్సన్ పదవి కోల్పోయేందుకు కారణమయ్యాయి.
పార్టీ గేట్: లాక్‌డౌన్ సమయంలో పార్టీ గేట్ వివాదంలో జాన్సన్ చిక్కుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార నివాసం డౌన్ స్ట్రీట్‌లో విందు సమావేశాలు నిర్వహించి అభాసుపాలయ్యారు. బర్త్‌డే పార్టీకి హాజరైన ఆయనకు పోలీసులు జరిమానా కూడా విధించారు. గతేడాది ఏప్రిల్‌లో బ్రిటన్ రాణి భర్త ఫిలిప్ అంత్యక్రియలను పురస్కరించుకొని.. తన అధికార నివాసంలో సిబ్బంది పార్టీ చేసుకోవటం వల్ల బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. లాక్ డౌన్ సమయంలో వరుసగా పార్టీలు జరుపుకున్నట్లు అధికారి ఒకరు ఓ నివేదిక సమర్పించారు. తొలుత తన అధికారిక నివాసంలో విందు సమావేశాలు జరగలేదని బుకాయించిన బోరిస్ జాన్సన్.. తర్వాత ఒప్పుకోవటం ద్వారా విశ్వాసం కోల్పోయారు.
క్రిస్ పించర్ వివాదం: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ క్రిస్ పించర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వాటిని ఎదుర్కోవడం సహా క్రిస్‌పై చర్యలు తీసుకోవడంలో ప్రధాని విఫలమయ్యారంటూ మంత్రులు, ఎంపీలు ఆరోపించారు. గత నెల 30న ది సన్ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. నాటి కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్ క్రిస్ పించర్, లండన్‌లోని ఓప్రైవేటు క్లబ్‌లో ఇద్దరు మగవాళ్లను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు పేర్కొంది. కొన్నేళ్ల నుంచి ఆయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ బ్రిటన్ పత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. లైంగిక వేధింపుల ఆరోపణలతో కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్ పదవికి క్రిస్ పించర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేశారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్రవరిలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్ పించర్‌ను.. పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్‌గా నియమించారు. ఆరోపణలు వచ్చిన విషయం తెలిసినా.. పించర్‌ను ఆ పదవిలో నియమించటాన్ని మంత్రులు, ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. పించర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ముందు తెలియదని, పార్టీ డిప్యూటీ హెడ్‌గా నియమించిన తర్వాతే తెలిసిందని ఈనెల ఒకటిన ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ పించర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల గురించి బోరిస్‌కు ముందే తెలుసంటూ
ఈనెల 4న బ్రిటన్ ప్రధాని అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే అధికారికంగా ఫిర్యాదు అందలేదని, సరైన ఆధారాల్లేని కారణంగా పించర్‌ను నియమించకుండా ఉండటం సరైంది కాదని ప్రధాని అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. కానీ పించర్‌పై లైంగిక వేధింపులకు సంబంధించి అధికారికంగా ఫిర్యాదు వచ్చిన సంగతి బోరిస్‌కు తెలుసనే విషయాన్ని అదే రోజు మధ్యాహ్నం మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఫైనల్ పంచ్: అధికారికంగా వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా క్రిస్ పించర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. లిఖితపూర్వకంగా కాకుండా నోటిమాట ద్వారా ఫిర్యాదు చేశారని, దానిపై చర్యలు తీసుకొని ఉండాల్సిందన్నారు. పించర్‌ను నియమించి తప్పుచేశానంటూ.. బాధితులకు బ్రిటన్ ప్రధాని జాన్సన్ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనతో బ్రిటన్ ప్రధానిపై విశ్వాసం కోల్పోయినట్లు మంత్రులు, ఎంపీలు ప్రకటించారు. ఒక్కొక్కరు రాజీనామా చేశారు. రాజీనామాల ఒత్తిడికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు.