Israel Election : ఇజ్రాయెల్‌లో దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని మితవాద పార్టీల కూటమి విజయానికి చేరువైంది. ఇజ్రాయెల్ పార్లమెంటులో మొత్తం 120 స్థానాలుండగా.. బుధవారం దాదాపు 86% ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆ కూటమి 65 సీట్లు గెల్చుకునే స్థితిలో నిలిచింది.
మిగిలిన వాటిలో మెజార్టీ ఓట్లు ఇతర పార్టీల ఖాతాల్లోకి వెళ్లినా నెతన్యాహు కూటమి కనీసం 61-62 స్థానాలను దక్కించుకొని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదని విశ్లేషకులు చెబుతున్నారు. 73 ఏళ్ల నెతన్యాహు.. లికడ్ పార్టీ అధినేత. ఇజ్రాయెల్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన రికార్డు ప్రస్తుతం ఆయన పేరు మీదే ఉంది. మళ్లీ ఇప్పుడు ఆయన ప్రధాని పీఠమెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. లికడ్ పార్టీ నాయకత్వంలోని కూటమిలో జియోనిజం, షాస్, యునైటెడ్ టారా జుడేయిజం వంటి పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో గత నాలుగేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి.
ఇవీ చదవండి : రష్యా ఉక్రెయిన్ యుద్ధం... ఒక్క రోజే వెయ్యి మంది పుతిన్ సేనలు మృతి
'ఆమె కాళ్లు విరగ్గొట్టాలనుకున్నా'.. అమెరికా స్పీకర్ కిడ్నాప్‌నకు యత్నం!