Bangladesh container depot fire accident: బంగ్లాదేశ్ ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రైవేటు కంటైనర్ డిపోలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మందికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి స్థానికంగా ప్రకంపనలు వచ్చాయి. సమీపంలోని భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 19 ఫైర్ఇంజిన్లు మంటలను ఆర్పేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. ఆరు అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
చిట్టాగాంగ్‌లోని సీతాకుందా ఉపజిలాజిలా ప్రాంతంలో ఉన్న బీఎం కంటైనర్ డిపోలో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక ఎస్ఐ నురుల్ ఆలం వెల్లడించారు. రాత్రి 9 గంటలకే మంటలు ప్రారంభయ్యాయని, 11.45 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. 'ఆ తర్వాత మంటలు ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు వ్యాపించాయి. ఓ కంటైనర్‌లో రసాయనాలు ఉండటం వల్ల మంటలు భారీగా చెలరేగాయి' అని వివరించారు. డిపో చాలా వరకు ఖాళీగానే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అగ్నిప్రమాదంలో 450 మందికి పైగా గాయపడ్డారని రెడ్ క్రిసెంట్ యూత్ హెల్త్ సర్వీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇస్తాకుల్ ఇస్లామ్ పేర్కొన్నారు. 350 మంది స్థానిక సీఎంసీఎహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఇతర ఆస్పత్రుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై అధికారులు అత్యున్నత స్థాయి విచారణ ప్రారంభించారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించనున్నారు.
మరోవైపు, మృతుల కుటుంబ సభ్యులకు 560 డాలర్ల పరిహారం (సుమారు రూ.43వేలు) ప్రకటించారు చట్టోగ్రామ్ డివిజనల్ కమిషనర్ అష్రఫ్ ఉద్దిన్. గాయపడ్డ వారికి 224 డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: