Avtar Singh Khanda Uk : మార్చ్ 9న బ్రిటన్‌లో భారత జాతీయ జెండాను అవమానపరిచిన ఖలిస్థాన్ మద్దతుదారుడు.. అమృత్‌పాల్ సింగ్ 'బాస్' అయిన అవతార్ సింగ్ ఖండా మృతి చెందాడు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు.. చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. పదిహేను రోజుల క్రితం అనారోగ్యంతో బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ ఆసుపత్రిలో చేరిన అవతార్ సింగ్.. శరీరమంతా విషపూరితం కావడం వల్ల చనిపోయినట్లు సమాచారం.
ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అవతార్ సింగ్ చాలా చురుగ్గా ఉండేవాడు. ఖలిస్థాన్‌కు మద్ధతుగా బ్రిటన్‌లో తన గళాన్ని గట్టిగా వినిపించేవాడు. గతంలో నిషేధిత సంస్థలను సైతం ఏకం చేసేందుకు అవతార్ సింగ్ ప్రయత్నించాడు. ఇతడు ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్‌కు ముఖ్యనేతగానూ పనిచేశాడు.
Avtar Singh Khanda Father :
అవతార్ సింగ్ తండ్రి.. కుల్వంత్ సింగ్ ఖుఖ్రానా. ఇతను కూడా ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ ఉగ్రవాదిగా పనిచేశాడు. అనంతరం 1991లో భద్రత దళాల చేతిలో హతమయ్యాడు. కుల్వంత్ సింగ్ ఖుఖ్రానా భార్య కూడా.. మరో కేఎల్ఎఫ్ ఉగ్రవాది గుర్జంత్ సింగ్ బుద్సింగ్‌వాలాకు బంధువని తెలిసింది.
జాతీయ జెండాను అవమానపిరిచిన అవతార్ సింగ్..
లండన్‌లోని భారత హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను.. ఖలిస్థాన్ అనుకూలవాదులు కిందికి దింపేసి అగౌరవపరచడంలో.. అవతార్ సింగ్ హస్తం ఉందని ఎన్ఐఏ తెలిపింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. అనంతరం దిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు.. లండన్‌లో చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది.
అమృత్‌పాల్ బాస్‌గా అవతార్ సింగ్..
Amritpal Singh : 'వారిస్ పంజాబ్ దే' నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌కు సంరక్షకుడిగా అవతార్ సింగ్ ఉన్నాడని ఎన్ఐఏ తెలిపింది. పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం వెతుకుతున్న సమయంలో.. 37 రోజుల పాటు అతన్ని జాగ్రత్తగా చూసుకుంది అవతారేనని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.
కీలక ఖలిస్థాన్ నేతలతో సంబధాలు..
Khalistan Movement In Uk : ఖలిస్థానీ అగ్రనేతలైన జగ్తార్ సింగ్ తారా, పరమ్‌జిత్ సింగ్ పమ్మాతో అవతార్ సింగ్ ఖండా.. చాలా సన్నిహితంగా ఉండేవాడని సమాచారం. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌లో పరమ్‌జిత్ సింగ్ పమ్మా కీలక నేత అని.. అతడు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్నాడని అధికారులు తెలిపారు.
లండన్‌లో భారత జాతీయ జెండాను అవమానపరచడంపై.. బ్రిటన్‌పై మండిపాటు..
2023 మార్చ్ 19న ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం లండన్‌లోని భారత హై కమిషన్ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసింది. ఈ చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. నిరసనకారులు భారత హైకమిషన్ కార్యాలయానికి వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.