Chris Reynolds Quadrillionaire : అమెరికాకు చెందిన ఓ వ్యక్తి.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారాడు. ప్రస్తుతం భూమిపై ఉన్న మొత్తం డబ్బుకన్నా ఎక్కువ విలువైన ఆస్తికి యజమాని అయ్యాడు. అయితే.. ఇదంతా కేవలం 2 నిమిషాలపాటే. అసలు ఏం జరిగిందో తెలిసే లోపే సీన్ మారిపోయింది. ఓ సాంకేతిక సమస్యే ఇందుకు కారణం. పదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పటికీ అనేక మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ కథేంటే మీరూ తెలుసుకోండి.
పేపాల్ మేజిక్..
అది 2013 జులై. అమెరికా పెన్సిల్వేనియాలోని డెలవేర్ కౌంటీకి చెందిన క్రిస్ రేనాల్డ్స్కు ఊహించిన షాక్ తగిలింది. పేపాల్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మొత్తం చూసి అతడి కళ్లు బైర్లు కమ్మాయి. మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్లు కాదు.. ఏకంగా 92 క్వాడ్రిలియన్ డాలర్లు అతడి పేపాల్ ఖాతాలో ఉన్నట్లు కనిపించింది.
Chris Reynolds Richest Man : క్రిస్ లెక్కల ప్రకారం.. అతడి పేపాల్ అకౌంట్ బ్యాలెన్స్ మహా అయితే 1000 డాలర్లే. అవి కూడా.. వింటేజ్ బీఎండబ్ల్యూ టైర్లు అమ్మితే వచ్చాయి. కానీ.. అనూహ్యంగా లెక్కలు మారిపోయాయి. $92,233,720,368,547,800 ఉన్నట్లు అకౌంట్ స్టేట్మెంట్ చెబుతోంది. ఇంతటి పెద్ద అంకెను చూసి క్రిస్ రేనాల్డ్స్ కంగారు పడిపోయాడు. అసలు ఏం జరిగిందో తెలియలేదు. అది అకౌంట్లోని బ్యాలెన్స్ కాదేమో, తానే అంత మొత్తం అప్పు చెల్లించాల్సి ఉందేమో అని భయపడ్డాడు. ఇంతలోనే పేపాల్ ఖాతాలో లెక్కలు మారిపోయాయి. కళ్లు చెదరగొట్టే అంకెలన్నీ మాయమైపోయాయి. 92 క్వాడ్రిలియన్ డాలర్లను పేపాల్ వెనక్కు తీసుకుంది. అయితే.. 2 నిమిషాలపాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా, తొలి క్వాడ్రిలియనీర్గా నిలిచిన ఘనత మాత్రం క్రిస్ రేనాల్డ్స్కు దక్కింది. అప్పట్లో ఆయన గురించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
సారీ చెప్పిన పేపాల్..
Chris Reynolds Paypal : క్రిస్ రేనాల్డ్స్ 'టూ మినిట్ క్వాడ్రిలియనీర్' కావడానికి కారణం పేపాల్లో జరిగిన తప్పిదమే. ఓ సాంకేతిక సమస్య వల్ల క్రిస్ ఖాతాలో 92 క్వాడ్రిలియన్ డాలర్లు జమ అయ్యాయి. నిజానికి భూమి మీద ఉన్న మొత్తం డబ్బు అంతటినీ కలిపినా.. క్రిస్ ఖాతాలో జమైనదానికి సమానం కాదు. భారీ పొరపాటు జరిగిందని తెలుసుకున్న పేపాల్ సిబ్బంది.. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. క్రిస్ అకౌంట్ నుంచి $92,233,720,368,547,800 విత్డ్రా చేసుకున్నారు. 'అసౌకర్యానికి చింతిస్తున్నాం' అంటూ ఓ ఈమెయిల్ పంపారు.
దేశం అప్పు తీర్చేద్దామనుకున్న క్రిస్..
క్రిస్ పేపాల్ మేజిక్ గురించి తెలియగానే అప్పట్లో అనేక వార్తా సంస్థలు అతడ్ని ఇంటర్వ్యూ చేశాయి. అకౌంట్లో ఇంతటి డబ్బు ఉందని చూడగానే ఎలా అనిపించిందని, ఆ సొమ్ముతో ఏం చేసేవారని ప్రశ్నించాయి. "దేశం అప్పు తీర్చేసేందుకు ఈ డబ్బును ఉపయోగించేవాడిని" అని జవాబు ఇచ్చాడు.
పేపాల్ బంపర్ ఆఫర్..
దేశం అప్పు తీర్చేద్దామని అనుకున్నానని క్రిస్ చెప్పిన మాటలకు పేపాల్ ఫిదా అయింది. క్రిస్ సూచించిన స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అయితే.. ఎంత మొత్తం ఇస్తుందో చెప్పలేదు.
2013లో జరిగిన ఈ ఘటనపై.. నెట్టింట ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది.