అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు.. ఆమెతో అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న ట్రంప్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు న్యూయార్క్ మన్‌హటన్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.45 గంటలు) న్యాయమూర్తి జువాన్ మెర్చన్ ఎదుటకు న్యాయవాదులతో కలిసి ట్రంప్ రాగా.. ఆయనపై నమోదైన నేరాభియోగాలను న్యాయమూర్తి చదివి వినిపించారు.
మొత్తం 34 అభియోగాలను ట్రంప్‌పై మోపారు. వాటన్నింటిలో తాను దోషిని కాదని న్యాయమూర్తికి ట్రంప్ విన్నవించారు. అంతకుముందు ట్రంప్ టవర్ నుంచి కార్ల ర్యాలీతో 1.30 గంటల సమయంలో లొంగిపోయేందుకు కోర్టు హాలు వద్దకు ట్రంప్ చేరుకున్నారు. వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేసి అటార్నీ కార్యాలయానికి తరలించారు. ట్రంప్ ఫింగర్ ప్రింట్, ఫొటోలను తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు హాలుకు తరలించారు. సాధారణంగా ఇలాంటి విచారణల్లో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొస్తారు. అయితే ట్రంప్ విషయంలో మినహాయింపులు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం ట్రంప్ కోర్టు నుంచి వెళ్లిపోయారు. ట్రంప్ తదుపరి విచారణ డిసెంబర్ 4 న ఉండనుందని తెలుస్తోంది. అయితే ఆ రోజు ట్రంప్ కచ్చితంగా హాజరు కావాల్సి ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
న్యూయార్క్‌లో హై అలర్ట్..
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాల నమోదైన సందర్భంగా న్యూయార్క్‌లో హై అలర్ట్ ప్రకటించారు. మన్‌హటన్‌లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు కీలక ప్రదేశాల్లో బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. అనేక వీధులను మూసివేశారు. ఇక ట్రంప్ అరెస్ట్‌తో రిపబ్లికన్లు భారీ ఎత్తున కోర్టు సమీపంలో ఉన్న పార్కు వద్దకు చేరుకున్నారు. రిపబ్లికన్ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు కూడా వచ్చారు. అక్కడ వారంతా ట్రంప్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
మరోవైపు.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ర్యాలీలు చేశారు. అయితే ట్రంప్‌కు మద్దతుగా జరుగుతున్న ఆందోళనల్లో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే.. వారు ఎంతటివారైనా సరే కచ్చితంగా అరెస్టు చేసి, శిక్ష పడేలా చేస్తామని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ హెచ్చరించారు.
ఇక ట్రంప్ విచారణను ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పలు అమెరికా మీడియా సంస్థలు కోర్టును అభ్యర్థించగా.. వాటిని న్యాయస్థానం తిరస్కరించింది. అయితే విచారణ ప్రారంభం కావడానికి ముందే కోర్టు గదితో పాటు ట్రంప్ ఫొటోలను తీసుకునేందుకు ఐదుగురు స్టిల్ ఫొటోగ్రాఫర్లకు మాత్రమే అనుమతులను జారీ చేసింది.
'నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు'
కోర్టు నుంచి బయటకు వచ్చాక ట్రంప్.. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ప్రాపర్టీకి తిరిగి వెళ్లారు. అక్కడ సుమారు 25 నిమిషాల పాటు ప్రసంగించారు. మంగళవారం న్యూయార్క్‌లో తనను అరెస్టు చేసిన తర్వాత 'అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని తాను ఎప్పుడూ అనుకోలేదు. నేను చేసిన ఏకైక నేరం మన దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిని నిర్భయంగా ఎదుర్కొవడమే. నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఇప్పుడున్నంత దృఢ నిశ్చయంతో నేనెప్పుడు లేను. దేశాన్ని రక్షించడానికి నేను చేస్తున్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరు.' అని ట్రంప్ అన్నారు.
ఇదీ కేసు..
2016 ఎన్నికల ప్రచారం సమయంలో.. శారీరక సంబంధం బయటకు రాకుండా పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో డొనాల్డ్ ట్రంప్ అనైతిక ఒప్పందం చేసుకున్నారని ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత స్టార్మీ కోర్టును ఆశ్రయించారు. తనతో సంబంధాన్ని బయటపెట్టవద్దంటూ ట్రంప్ బెదిరించారని, అంతే కాకుండా ట్రంప్ లాయర్ తనకు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చారని స్మార్టీ డేనియల్స్ ఆరోపించారు.