Ukrainian separatist regions : ఉక్రెయిన్‌లో తాము ఆక్రమించుకున్న లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రావిన్స్‌లు సహా దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను ఇకపై తమ దేశంలో శాశ్వతంగా కలుపేసుకునేందుకు పుతిన్ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఆయా ప్రాంతాలు రష్యాలో చేరే విషయమై ఈ నెల 23 నుంచి 27 వరకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు డాన్‌బాస్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాద నేతలు ప్రకటించారు. లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలు తమకు కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ రిఫరెండం రష్యా భౌగోళిక, రాజకీయ చిత్రాన్ని శాశ్వతంగా మార్చనుందని పుతిన్ సన్నిహితులు వ్యాఖ్యానించారు.
లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలు రిఫరెండం తర్వాత అధికారికంగా రష్యాలో చేరితే ఇక ఆ సరిహద్దులను మార్చేందుకు వీలుపడదు. వాటిపై ఎవరైనా దాడిచేసినా ఎంతకైనా తెగించే అవకాశం మాస్కోకు దక్కుతుంది. ఆ రెండు ప్రావిన్స్‌ల గురించి ఇక ఉక్రెయిన్ మర్చిపోవాల్సి వస్తుంది. రిఫరెండంలో ప్రజా తీర్పు రష్యాకు అనుకూలంగానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐతే ఆ రిఫరెండంను పశ్చిమ దేశాలు గుర్తించవని పేర్కొన్నారు. ఇటీవల ఖార్కివ్ రీజియన్‌లో రష్యా ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న వేళ ఈ రిఫరెండం జరుగుతుండటం గమనార్హం.
రిఫరెండంలో ఫలితం రష్యాకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలుకాక ముందే లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాల్లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు, ఉక్రెయిన్ సైన్యానికి ఎన్నో ఏళ్లుగా పోరు జరుగుతోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా... తొలుత ఈ ప్రాంతాలపైనే దృష్టిసారించింది. తిరుగుబాటుదారుల సాయంతో తొలుత ఈ రెండు ప్రావిన్స్‌లను ఆక్రమించుకుంది. ఇప్పుడు వాటిని తమ దేశంలో శాశ్వతంగా అంతర్భాగాలుగా చేసుకునేందుకు సిద్ధమైంది.
ఇదీ చదవండి: వీడని 'సెప్టెంబర్ 19' డేంజర్.. అదే రోజు మళ్లీ భారీ భూకంపం.. ప్రాణ, ఆస్తి నష్టం
స్కూల్‌పై సైన్యం దాడి.. 13 మంది బలి.. మృతుల్లో ఏడుగురు పిల్లలు