Indonesia Truck Crash: ఇండోనేసియాలోని పపువా రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈస్టర్ వేడుకలు చేసుకునేందుకు 29 మందితో వెళ్తున్న ఓ భారీ ట్రక్కు కొండను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గని కార్మికులు, వారి కుటుంబాలతో కిక్కిరిసిన ట్రక్కు.. రాజధాని నగరంవైపు వెళ్తుండగా కొండను ఢీకొట్టి పల్టీలు కొట్టినట్లు అధికారులు తెలిపారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తుండటమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.
బాధితులంతా.. మారుమూల ప్రాంతాల్లో అక్రమ గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు చేస్తూ అక్కడే నివసిస్తున్నట్లు తెలిసింది. కొండచరియలు విరిగిపడటం, వరదలతో ప్రమాదమని తెలిసినా.. పొట్ట నింపుకోవడానికి చాలా మంది అందులోనే పనిచేస్తుంటారని అధికారులు వెల్లడించారు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాగే అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు చేస్తుండగా.. ప్రమాదంలో 40 మంది సమాధి అయ్యారు.
Truck Tourist Bus Crash: టూరిస్ట్ బస్సు.. ఓ ట్రక్కును ఢీకొని మంటలు చెలరేగగా 10 మంది మరణించారు. ఈజిప్ట్‌లోని లక్సర్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదుగురు ఈజిప్ట్, నలుగురు ఫ్రాన్స్, ఒకరు బెల్జియంకు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడ్డ మరో 14 మందికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. ప్రమాదానికి అసలు కారణం తెలియరాలేదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'విదేశీ రుణాలు చెల్లించలేం'.. చేతులెత్తేసిన శ్రీలంక