సుమారు రెండు సంవత్సరాలుగా కొవిడ్-19 మహమ్మారి(Corona virus) ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుతూ లక్షల మంది ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పుడు మరో కొత్త ముప్పు వచ్చి పడింది. అత్యంత ప్రమాదకరమైన ఒమిక్రాన్ వేరియంట్(omicron variant) ప్రపంచాన్ని కలవరపెడుతోంది. సరైన చర్యలు చేపట్టి కొత్త ముప్పును కట్టడి చేసేందుకు అన్ని దేశాలు సన్నద్ధమవ్వాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
కొత్త వేరియంట్‌కు 'ఒమిక్రాన్'గా నామకరణం(omicron variant of concern) చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యానల్. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌గా పేర్కొంది. ఐరోపా, అమెరికాలో అత్యధిక కేసులు, మరణాలకు కారణమైన డెల్టా రకానికి చెందినదిగా వెల్లడించింది.
బైడెన్ హెచ్చరిక..
అమెరికాలో ఇటీవల జరిగిన థ్యాంక్స్ గివింగ్ వేడుకల్లో లక్షలాది మంది పాల్గొన్న మరుసటి రోజునే కొత్త వేరియంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. "అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకంగా ఇది కనిపిస్తోంది. మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం." అని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్(omicron variant of concern) ప్రభావంపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేకపోతున్నామని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ప్రస్తుతానికి ఉన్న ఆధారాల ప్రకారం గతంలోని వేరియంట్లతో పోలిస్తే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిపింది. కొవిడ్-19 సోకిన, వైరస్ నుంచి కోలుకున్న వారు సైతం మళ్లీ ఈ మహమ్మారి బారిన పడే అవకాశం ఎక్కువని హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న టీకాలు ఈ రకంపై ఎంత మేర పని చేస్తున్నాయని తెలిసేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని తెలిపింది.
ప్రయాణ ఆంక్షలు..
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్లు(corona new variants) పుట్టుకొస్తున్న క్రమంలో అమెరికా, కెనడా, రష్యా సహా పలు దేశాలు ఆ ప్రాంతం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. దక్షిణాఫ్రికా సహా ఆ ప్రాంతానికి చెందిన ఏడు దేశాలపై ప్రయాణ ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని శ్వేతసౌధం వెల్లడించింది.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం బెల్జియం, హాంగ్‌కాంగ్, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో వెలుగు చూసింది. అయితే.. తీవ్ర అనారోగ్యానికి కారణమవుతున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు కనిపించలేదు.
కుప్పకూలిన స్టాక్స్...
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ కలకలంతో ఆసియా, ఐరోపా, అమెరికా స్టాక్స్ కుప్పకూలాయి. డౌజోన్స్ సుమారు 1000 పాయింట్లు కోల్పోయింది. ఎస్అండ్పీ500 ఇండెక్స్ 2.3 శాతం మేర పడిపోయింది. చమురు ధరలు 13 శాతం పడిపోయాయి.
ప్రయాణ ఆంక్షలతో వైరస్ కట్టడి చేయగలమా?
ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో చాలా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణాలపై ఐరోపా దేశాలు శుక్రవారం నుంచే ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి. అలాగే సౌతాఫ్రికాతో పాటు మరో ఐదు దేశాల నుంచి వచ్చే విమానాలపై బ్రిటన్ నిషేధం విధించింది. ఇటీవల అక్కడి నుంచి వచ్చిన వారు తప్పక టెస్టులు చేయించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో విమానాల రద్దు, ప్రయాణ ఆంక్షలు వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలవా? అనే చర్చ మొదలైంది. దీని ద్వారా కట్టడి చర్యలు చేపట్టేందుకు సమయం దొరుకుతుందని కొందరు వాదిస్తుండగా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేమని మరికొంతమంది చెబుతున్నారు.
ఇదీ చూడండి: అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. ప్రపంచ దేశాల గజగజ