భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి తీవ్రత తొలి దశలోనే ఉందని స్పష్టం చేశారు. దక్షిణ అమెరికా, దక్షిణాసియా సహా మరికొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు.
"ప్రస్తుతం మనం రెండో దశలో లేము. మొదటి దశ మధ్యలో ఉన్నాం. నిజానికి వైరస్ అధికమయ్యే దశలోనే ఉన్నాం."
-మైక్ ర్యాన్, డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
బ్రెజిల్లో వ్యాప్తి రేటు తీవ్రంగా ఉండటం వల్ల పలు జాగ్రత్తలు పాటించాలని ర్యాన్ సూచించారు. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ.. ప్రజలు ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడిలో కీలకమైన పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
రూటు వేరు
అయితే బ్రెజిల్ యంత్రాంగం మాత్రం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపైనే దృష్టి సారించింది. పూర్తి స్థాయి లాక్డౌన్ అమలును కొట్టిపారేసిన సావో పాలో రాష్ట్ర గవర్నర్ జూ డోరియా.. జూన్ 1 నుంచి ఆంక్షలు సడలించనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రార్థనా స్థలాలను అత్యవసర సేవల జాబితాలో చేర్చుతూ రియో డి జెనిరో నగర మేయర్ నిర్ణయం తీసుకున్నారు.
బ్రెజిల్లో ఇప్పటివరకు 3.75 లక్షల కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసుల జాబితాలో రష్యాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరింది బ్రెజిల్. 23 వేల మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ.. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
భారత్‌లో తీవ్రం
గత ఏడు రోజుల నుంచి భారత్‌లో కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తం 1.45 లక్షల కేసులు నమోదు కాగా.. 4,167 మరణాలు సంభవించాయి.
భారత్‌లో ఎక్కువ శాతం కేసులు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.
సడలింపు దిశగా...
మరోవైపు మిగిలిన దేశాలు సైతం లాక్డౌన్ నిబంధనలు సడలించే యోచనలో ఉన్నాయి. సురక్షితమైన దేశాల నుంచి ప్రయాణాలకు అనుమతించే విషయంపై ఐరోపా దేశాలన్నీ కలిసి సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలని స్పెయిన్ విదేశాంగ మంత్రి ఆయా దేశాలకు సిఫార్సు చేశారు. ఐరోపాకు చెందిన దేశాల నుంచి పర్యటకులను అనుమతిస్తూ ఇదివరకే నిర్ణయం తీసుకుంది స్పెయిన్.
దక్షిణ కొరియాలో నైట్‌క్లబ్‌లు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రదేశాలకు వెళ్లిన వారిలో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే.. బుధవారం నుంచి పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
తాత్కాలికంగా..
మరోవైపు కరోనా చికిత్సలో వినియోగానికి సిఫార్సు చేసే ఔషధాల జాబితా నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తాత్కాలికంగా తొలగించనున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ డ్రగ్ తీసుకుంటున్న వారిలో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: 'ట్రంప్‌పై విమర్శలు ఎందుకు..? ఆ మందు మంచిదే'