కరోనా వైరస్‌తో ఆసుపత్రిలో చేరిన రోగులపై గిలీడ్ సైన్సెస్‌కు చెందిన యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ ప్రభావం చూపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ ఔషధంతో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్, ఇంటర్‌ఫెరాన్ కూడా రోగులపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని తెలిపింది. ఆసుపత్రిలో బాధితులు కోలుకునే సమయాన్ని తగ్గించడానికి, మరణం నుంచి బయటపడేయడానికి ఈ మందు దోహదం చేయడం లేదని పేర్కొంది.
కరోనా చికిత్సలో ప్రయోగాత్మక ఔషధాలైన ఈ నాలుగింటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 30 దేశాలకు చెందిన 11 వేల 266 మంది వయోజనులపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహించింది. మరణం నుంచి తప్పించడం, ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించడంలో ఈ ఔషధాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని ఆ సర్వేలో తేలింది. ఈ ప్రయోగ ఫలితాలను ఇంకా సమీక్షించాల్సి ఉంది.
అస్థిరంగా...
అయితే డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన వివరాలు అస్థిరంగా ఉన్నాయని గిలీడ్ వెల్లడించింది. ఈ సమాచారం నిర్మాణాత్మకమైన శాస్త్రీయ చర్చకు అనుకూలంగా లేదని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో 1,062 మందిపై చేపట్టిన అధ్యయనంలో రెమ్‌డెసివిర్ కొవిడ్ బాధితుల చికిత్సా సమయాన్ని ఐదు రోజులు తగ్గించిందని వెల్లడైనట్లు గిలీడ్ ప్రకటించింది. కొవిడ్ -19 బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట అనుమతి పొందిన ఔషధం ఇదే కావడం గమనార్హం. రెమ్‌డెసివిర్ అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ మే నెలలోనే అనుమతినిచ్చింది.
- ఇదీ చూడండి: ఆ కరోనా వ్యాక్సిన్ ధర రూ.4,399..!