WHO Poverty Covid: కొవిడ్ మహమ్మారి కారణంగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌కు సంబంధించి రెండు దశబ్దాలుగా ప్రపంచం సాధించిన పురోగతి దెబ్బ తీనే అవకాశం ఉంది. సొంతఖర్చులతోనే వైద్యం చేయించుకోవడం వల్ల తీవ్ర పేదరికంలోకి జారిపోయిన ప్రజల సంఖ్య 50 కోట్లపైమాటే. వైద్య సేవలు పొందే సామర్థ్యంపై కొవిడ్ ప్రభావాన్ని ఎత్తి చూపుతూ ప్రపంచ ఆరోగ్యసంస్థ చేసిన విశ్లేషణలో వెల్లడైన విషయాలు ఇవి. కొవిడ్ తర్వాత పరిస్థితుల్ని నుంచి తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న దేశాలకు ఈ హెచ్చరిక చేసింది. ఇక సమయం లేదని, ప్రపంచ దేశాలన్నీ వెంటనే స్పందించాలంటూ ప్రపంచ బ్యాంకు నివేదిక సారాన్ని కూడా వెల్లడించింది.
పేదరికం పెరగడం, ఆదాయాలు తగ్గడం, ప్రభుత్వాలు కఠినమైన ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్నందున.. ఈ ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య సంస్థ, వరల్డ్ బ్యాంకు నివేదికలు హెచ్చరించాయి. 'కొవిడ్ మహమ్మారికి ముందే దాదాపు 100 కోట్ల మంది తమ ఆదాయంలో 10 శాతానికి పైగా ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆర్థిక పరిమితుల మధ్య ప్రభుత్వాలు వైద్య సేవల వ్యయాన్ని పెంచేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది' అని ప్రపంచ బ్యాంకుకు చెందిన జువాన్ ఉరిబె వెల్లడించారు. మహమ్మారికి ముందు 68 శాతం మందికి అత్యవసర వైద్య సేవలు అందేవని నివేదిక పేర్కొంది.
'ఏ మాత్రం సమయం లేదు. ప్రపంచ దేశాలు తమ పౌరులంతా ఆర్థిక పరిణామాలకు భయపడకుండా ఆరోగ్య సేవల్ని పొందగలరని నిర్ధారించే ప్రయత్నాలను వెంటనే తిరిగి ప్రారంభించాలి. వాటిని వేగవంతం చేయాలి. వైద్య సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని దీనర్థం. అలాగే ఇంటికి దగ్గర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలి. మహమ్మారికి ముందు సాధించిన పురోగతి అంత బలంగా లేదు. ఈసారి భవిష్యత్తుల్లో ఎదురయ్యే మహమ్మారులు ఇచ్చే షాక్‌లను తట్టుకునేలా వ్యవస్థల్ని నిర్మించాలి. అలాగే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దిశగా నిర్ణయాలు తీసుకోవాలి' అని ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు. పేదలు వైద్యం కోసం డబ్బులు వెచ్చించే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకోసం పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని సూచించింది.
ఇదీ చూడండి : Houston Shooting: 50 మంది సమూహంపై కాల్పులు- పదుల సంఖ్యలో..