WHO On Omicron Virus: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణపై కీలక విషయాలను వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). గతవారంలో 2 కోట్ల 10 లక్షలకుపైగా కేసులు నమోదైనట్లు తెలిపింది. ఒక్క వారం వ్యవధిలోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం.. కరోనా ప్రబలినప్పటి నుంచి ఇదే మొదటిసారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా బలపడుతోందని హెచ్చరించింది. డెల్టా వేరియంట్‌తో పోల్చితే.. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, శ్వాసనాళాలపై అధిక ప్రభావం చూపుతోందని తేలినట్లు పేర్కొంది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు 'కొవిడ్-19 వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్డేట్' నివేదికను మంగళవారం విడుదల చేసింది. గతవారం(జనవరి 17-23) ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 5 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
వారం వ్యవధిలో 50వేల మరణాలు..
కరోనా ధాటికి వారం వ్యవధిలోనే కొత్తగా 50వేల మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్ఓ రిపోర్టులో పేర్కొంది. జనవరి 23 నాటికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్లకుపైగా కేసులు నమోదైనట్లు, 50లక్షలకుపైగా మరణాలు సంభవించినట్లు స్పష్టం చేసింది.
అనేక దేశాల్లో సామాజికవ్యాప్తి..
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా చాలా దేశాల్లో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలో పేర్కొంది. గతేడాది నవంబర్, డిసెంబర్లో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో ప్రస్తుతం.. కరోనా వ్యాప్తి తగ్గినట్లు స్పష్టం చేసింది.
లక్షణాలు సున్నా.. కానీ..
డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ సోకినప్పుడు లక్షణాలు ఏవీ ఉండటం లేదని అధ్యయనాల్లో తేలింది. ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఆగ్నేయాసియాలో గతవారంతో పోల్చితే 36శాతం కేసులు పెరిగినట్లు తెలిపింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయని.. మరణాలు కూడా ఈ దేశాల్లో గతంవారంతో పోల్చితే 44శాతం పెరిగినట్లు రిపోర్టులో పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ. ఈ దేశాల్లోనే కొత్తగా 3,700 మరణాలు సంభవించినట్లు తెలిపింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!