ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీలో అసమానత్వం కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సరైంది కాదని.. అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్ అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
"ధనిక దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి ఒక మోతాదు కొవిడ్ టీకా లభించింది. అదే తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ప్రతి 500 మందిలో ఒకరికే వ్యాక్సిన్ అందింది. ఈ అసమానత్వం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పేద దేశాలకు పూర్తిస్థాయిలో వేగంగా టీకా అందాలంటే.. ఐరాస ఆధ్వర్యంలో ఏర్పడిన 'కోవాక్స్' ముందుకు రావాలి."
-- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్
ఏ ప్రాంతాన్ని వదలని మహమ్మారి
కరోనా మహమ్మారి బారి నుంచి ఏ దేశమూ తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొవిడ్ బాధితులతో టర్కీ, పోలండ్‌లోని ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మరోవైపు వైరస్ కట్టడికి పాకిస్థాన్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా దేశీయ విమాన ప్రయాణాలను పరిమితం చేసింది. థాయ్‌లాండ్‌నూ కరోనా ఉప్పెన వదలడం లేదు. ఇరాన్‌లో కొత్త కేసులు పెరుగుతున్నాయి.
పలు దేశాల్లో కేసుల పెరుగుదలతో పాటు మరణాలూ అధిక సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కల్గించే అంశంగా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. వ్యాక్సిన్ విజయవంతంగా జరుగుతున్న దేశాల్లోనూ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోందని తెలిపింది.
ఇదీ చదవండి : అమెరికా నౌక సంచారంపై భారత్ తీవ్ర అభ్యంతరం