చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీక అయిన దీపావళి స్ఫూర్తిని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కొనియాడారు. 'ఐగ్లోబల్ దివాళి ఫెస్ట్ 2020' కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం ఇచ్చిన ఆయన... ఈ పండుగ స్ఫూర్తితో కొవిడ్‌పై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌లో రెండో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. వైరస్ కట్టడికి ప్రజలందరూ కలసికట్టుగా పోరాడాలని అన్నారు.
"మన ముందు అతిపెద్ద సవాలు పొంచి ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశ ప్రజల సంకల్పంపై నాకు విశ్వాసం ఉంది. కలిసికట్టుగా ఈ వైరస్‌పై గెలుపు సాధిస్తాం. చెడుపై మంచి, చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై విజ్ఞానం గెలుస్తుందని దీపావళి మనకు బోధించినట్లుగా వైరస్‌పై మనం విజయం సాధిస్తాం. రాక్షస రాజు రావణుడిని చంపిన తర్వాత రాముడు, సీత తమ ఇంటికి పయనమైనప్పుడు వారి మార్గం మొత్తం లక్షలాది దీపాలతో వెలిగిపోయినట్లుగానే.. మనం కూడా ఈ సమస్య నుంచి బయటపడే మార్గం కనుగొంటాం, విజయవంతంగా బయటపడతాం."
-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు తలెత్తినప్పటికీ దీపావళిని సురక్షితంగా నిర్వహించేందుకు బ్రిటన్‌లోని భారత ప్రవాసులు చేస్తున్న కృషిని, త్యాగాలను కొనియాడారు బోరిస్. వర్చువల్ దీపావళి నిర్వహించడాన్ని ఆహ్వానించారు.
"దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక్కచోట చేరి కలిసి ఉండాల్సిన సమయంలో దూరంగా ఉంటూ పండుగ నిర్వహించుకోవడం సులభం కాదు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీ త్యాగం, సంకల్పం చాలా ఉపయోగపడింది. ఈ సంక్షోభ సమయంలో యూకేలోని హిందువులు, సిక్కులు, జైనులందరూ స్ఫూర్తిమంతంగా స్పందించారు."
-బోరిస్ జాన్సన్, యూకే ప్రధాని
మూడు రోజుల పాటు జరగనున్న ఈ వర్చువల్ 'దివాళి ఫెస్ట్' కార్యక్రమంలో బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతీ పటేల్, విపక్ష పార్టీ నేత కెయిర్ స్టార్మెర్, లిబరల్ డెమొక్రాట్ నేత ఎడ్ డేవీ పాల్గొననున్నారు. యోగా, సంగీత, నృత్య ప్రదర్శనలు సైతం జరగనున్నాయి.