వేసవి వచ్చేసింది... మంటపుట్టించే ఎండల ధాటికి కరోనా తోక ముడవటం ఖాయం... ఆ మహమ్మారి మనల్ని ఏమీ చేయలేదని ఇప్పటిదాకా ఓ నమ్మకం ఉండేది. అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని, కరోనాపై వేసవి ఎలాంటి ప్రభావమూ చూపదని, పైగా ఆ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభించవచ్చునని ఓ తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఏమిటీ పరిశోధన?
ఫ్రాన్స్‌లోని ఎయిక్స్-మార్సిల్లె యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రెమి ఛారెల్, బోరిస్ పాస్టోరినో ఈ పరిశోధనను నిర్వహించారు. 197.6 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలో, 212 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి నీటిలో కరోనా వైరస్‌ను 15 నిమిషాల పాటు ఉంచినప్పుడు మాత్రమే అది చనిపోయినట్లు తేల్చారు. దీన్ని బట్టి 92 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిమిలో 15 నిమిషాల పాటు, 56 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో దాదాపు గంటసేపు కరోనా వైరస్‌ను ఉంచినప్పుడే దానిని చంపగలమని వారు వెల్లడించారు.
ఫలితాల్లో తేడాలు...
ఈ నెల మొదట్లో హాంకాంగ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో 132 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో 30 నిమిషాల పాటు కరోనా వైరస్ జీవించే ఉందని తేలింది. ఉష్ణోగ్రతను 158 డిగ్రీలకు పెంచినప్పుడు 5 నిమిషాల్లోనే అది చనిపోయిందని గుర్తించారు. ఈ ఫలితాలకు ఎయిక్స్-మార్సిల్లె యూనివర్సిటీ పరిశోధన తేల్చిన అంశాలకు మధ్య ఎంతో తేడా ఉండటం గమనార్హం. ప్రయోగశాలల్లో భారీ ఉష్ణోగ్రతలను కృత్రిమంగా సృష్టించి, నియంత్రిత పరిస్థితుల్లో చేసే అధ్యయనాల ఫలితాల్లో తేడాలు ఉండటం సహజమని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రయోగశాలల్లో కృత్రిమ వేడిమిని సృష్టించి చేసే పరిశోధనలకు, వాస్తవ ప్రపంచ వాతావరణ పరిస్థితులకు ముడిపెట్టడంలో ఔచిత్యం లేకపోవచ్చునని, ఇప్పటిదాకా మనం చూసిన కరోనా వైరస్‌లు తక్కువ తీవ్రత కలిగినవి కాబట్టి ఉష్ణోగ్రతలకు ప్రభావితమయ్యేమని, ప్రస్తుతం విజృంభిస్తున్న కొత్త కరోనాను వేడిమి ఏమీ చేయజాలదని డాక్టర్ హార్వే ఫిన్‌బెర్గ్ అనే శాస్త్రవేత్త స్పష్టంచేశారు. శ్వాస క్రియద్వారా ఊపిరితిత్తుల్లోకి బిందువులు ప్రయాణించే తీరు గాలిలోని ఆర్ద్రత వల్ల మార్పులకు లోనవుతుందని, తద్వారా వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా నామమాత్రమని కొందరు శాస్త్రవేత్తలు చెప్పారు.
యూవీ... భరోసా!
బహిరంగ ప్రదేశాల్లో కంటే... గృహాలు, భవనాల లోపల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, సూర్యకాంతిలో వైరస్ త్వరగా చనిపోవడమే అందుకు కారణమని అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్) తన అధ్యయనంలో తేల్చింది. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ప్రయోగశాలలను వైరస్ రహితంగా మార్చేందుకు దాని జన్యువులను చంపేందుకు అతినీల లోహిత కిరణాల(అల్ట్రా వయొలెట్-యూవీ) కాంతిని ఆయుధంగా వాడుతుండటాన్ని వారు గుర్తుచేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా పడేచోట్ల వైరస్‌ను నిలువరించడం సులభతరమని చెబుతున్నారు.
ఈ రెండింటి వల్లే...
లక్షణాలు బయటకు కనిపించనీయకుండా వ్యాపించడం, దాన్ని అడ్డుకునేంత వ్యాధి నిరోధక శక్తి మనుషుల్లో లేకపోవడమనే కారణాల వల్ల కరోనా విజృంభిస్తోందని, అందుకే కనీసం దాన్ని ఆపలేకపోతున్నామని కొందరు శాస్త్రవేత్తలు సూత్రీకరించారు.
అలాంటి ఆశలేమీ వద్దు
వేసవిలో కరోనా ఉద్ధృతికి కళ్లెం పడుతుందనే ఆశలేమీ పెట్టుకోవద్దని, ఎక్కువ ఉష్ణోగ్రతల్లోనూ ఆ వైరస్ తనపని తాను చేసుకుపోతుందని, పలు పరిశోధనలు, అధ్యయనాల నివేదికలను క్రోడీకరించాక దీనిపై నిర్ధరణకు వచ్చామని అమెరికాలోని 'నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ మెడిసన్' అనే సంస్థ హెచ్చరిస్తోంది. 'అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే... వేసవిలో కరోనా తగ్గే సూచనల్లేవని తెలుస్తోంది. ఎండల్ని దృష్టిలో పెట్టుకుని మన వ్యూహాలను విధానాలను మార్చుకోకుండా... ప్రస్తుతం ఉన్నట్లుగానే జాగ్రత్తలు వహించాలి' అని వైట్‌హౌస్‌లోని శాస్త్ర సాంకేతిక విధాన కార్యాలయ డైరెక్టర్ కెల్విన్ డ్రోయెగ్మియర్ సూచించారు.
దేని చరిత్ర చూసినా...
'గడచిన 250 ఏళ్లలో మొత్తం 10 ఇన్‌ఫ్లుయంజా మహమ్మారులు ప్రపంచాన్ని వణికించాయి. వీటిలో రెండు ఉత్తరార్ధ గోళ శీతాకాలంలో, మూడు వసంతకాలంలో, మరో రెండు వేసవిలో, మరో మూడు శరదృతువులో వచ్చాయి. ప్రారంభ సమయంలో ఇవి చూపిన ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఆరు నెలల తర్వాత రెండోదశలో ప్రతి ఒక్క వైరస్ మానవజాతికి అపార నష్టాన్ని కలుగజేశాయి. అందుకే చలి, ఎండాకాలాల జోలికి పోకుండా జాగ్రత్త పడటమే మేలు' అని పరిశోధకులు కొందరు తేల్చి చెప్పారు. నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్స్ ఇదే విషయాన్ని వైట్‌హౌస్‌కు నివేదించింది.
ఇదీ చదవండి: ప్రపంచంపై 'కరోనా' కరాళ నృత్యం.. 2 లక్షలు దాటిన మృతులు