వేగంగా నడిచేవారు ఇతరులతో పోలిస్తే ఎక్కువ కాలం బతుకుతారని తాజా అధ్యయనం చెప్తోంది. మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్ అనే జర్నల్లో ఈమేరకు ఓ కథనం ప్రచురితమైంది.
బ్రిటన్ జాతీయ ఆరోగ్య పరిశోధనా సంస్థ(ఎన్ఐహెచ్ఆర్), లీసెస్టర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు మొత్తం 4లక్షల 74వేల 919 మంది సమాచారం సేకరించి అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో మనిషి బరువుతో నిమిత్తం లేకుండా నడిచే పద్ధతికి, ఆయువు పెరుగుదలకు సంబంధం ఉందని తేలింది.
బరువు తక్కువున్న వారిలో నడక నెమ్మదిగా ఉంటే... జీవిత కాలం తక్కువగా ఉంటున్నట్లుగా అధ్యయనంలో వెల్లడైంది. అలాంటి వారు సగటున పురుషులు 64.8 సంవత్సరాలు, మహిళలు 72.4 సంవత్సరాలు బతుకుతున్నారని లెక్కగట్టింది.
వేగంగా నడిచేవారితో పోల్చితే... నెమ్మదిగా నడిచే వారికి రెండు రెట్లు ఎక్కువగా గుండెపోటు వచ్చే ప్రమాదముందని తేలింది. పొగతాగే అలవాటు, బీఎంఐ వంటివి పరిగణనలోకి తీసుకున్నా ఈ ప్రభావం అలానే ఉందని పరిశోధన చెబుతోంది.
"మా పరిశోధన వ్యక్తుల శరీర బరువుతో పోల్చితే శారీరక దృఢత్వం జీవితకాలంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై స్పష్టత ఇచ్చేందుకు సహకరిస్తుంది. మరోలా చెప్పాలంటే... బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) కంటే.. బహుశా శారీరక దృఢత్వమే ఆయుష్షు అంచనా వేసేందుకు సరైన సూచీ అని పరిశోధనలో తేలింది. జనాల ఆయువు పెరిగేలా.. వేగంగా నడవటం అలవాటు చేసుకునేలా ప్రోత్సహించాలని చెబుతోంది."
-టామ్ యేట్స్, అధ్యాపకులు, లీసెస్టర్ యూనివర్సిటీ, యూకే