UN Chief On Russia: ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యకు పాల్పడడాన్ని తప్పుబట్టారు. రష్యా తక్షణమే ఈ చర్యలను మానుకోవాలని కోరారు. రష్యా చర్యలు ఐరాస చార్టర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.
" ఉక్రెయిన్ భూభాగంలో రష్యా ఆగడాలను మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు కొన్ని దశాబ్దాలుగా యూరోప్ చూడలేదు. రష్యా చర్యలు యూఎన్ చార్టర్‌కు వ్యతిరేకం. ఉక్రెయిన్‌లో చావు, భయం, తదితర చిత్రాలను చూస్తున్నాం. "
-- ఆంటోనియో గుటెరస్, ఐరాస సెక్రటరీ జనరల్
రష్యా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచం మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు గుటెరస్. అది లక్షలమంది జీవితాలపై ప్రభావం చూపుతుందన్నారు. రష్యా తక్షణమే తన బలగాలను వెనక్కుతీసుకోవాలని కోరారు. యుద్ధంలో అమాయకప్రజలే బలవుతారని అన్నారు.
రష్యా దాడిలో 137 మంది మృతి..
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తిప్పికొట్టేందుకు పూర్తి సన్నద్ధంతో ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు. మరో 90రోజులపాటు బలగాల మోహరింపు ఉంటుందన్నారు.
మరోవైపు రష్యా దాడిలో ఇప్పటివరకు 137 మంది పౌరులు, సైనికులు మృతి చెందారని పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వీరులను హీరోలుగా అభివర్ణించారు జెలెన్స్కీ. వందలాది మంది గాయపడ్డారని తెలిపారు.
" రష్యా సైనికులు ఉక్రెయిన్ ప్రజలను చంపేస్తున్నారు. శాంతితో ఉన్న నగరాలను మిలిటరీ లక్ష్యాలుగా మారుస్తున్నాయి. ఇది చాలా దారుణమైనది. ఈ చర్యను వదిలిపెట్టం."
-- జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
మినియి ద్వీపం సరిహద్దులోని సైనికులందర్నీ రష్యా మట్టుబెట్టిందని జెలెన్స్కీ అన్నారు.
రష్యాకే భారీ నష్టం..
ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యకు పాల్పడటాన్ని అనవసరమైనదిగా అభివర్ణించింది జర్మనీ. ఇలాంటి చర్యల వల్ల రష్యా భవిష్యత్తులో ఆర్థికంగా దెబ్బతింటుందని స్పష్టం చేసింది. రష్యా నుంచి బొగ్గు, నూనె, గ్యాస్ విక్రయాన్ని పశ్చిమ దేశాలు నిలిపివేస్తాయని.. తద్వారా రష్యా ఆర్థికవ్యవస్థకు గండిపడుతుందని జర్మనీకు చెందిన వైస్ ఛాన్సెలర్ రాబర్ట్ హేబక్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ దేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను రష్యా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందన్నారు.
చెర్నోబిల్ ప్లాంట్ రష్యా అధీనంలోకి..
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు రియటర్స్ మీడియా పేర్కొంది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయంలోని ఓ సలహాదారు వెల్లడించినట్లు స్పష్టం చేసింది.1986లో.. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు విపత్తు చోటుచేసుకుంది ఇక్కడే.
ఇదీ చూడండి: 'యుద్ధాన్ని ఎంచుకున్న పుతిన్.. అనుభవించక తప్పదు'