Ukraine-Russia Crisis: ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలు డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌కు స్వతంత్రహోదా గుర్తింపునిస్తూ తీసుకున్న నిర్ణయానికి రష్యా పార్లమెంటు ఆమోదం తెలిపింది. తద్వారా ఆ ప్రాంతాల్లో రష్యా బలగాల మోహరింపునకు వీలు కల్పించింది. ఇదే సమయంలో ఆ సాయుధ వాహనాలు తిరుగుతున్నాయి. పుతిన్ ఆదేశాలతో రష్యా సేనలే తూర్పు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లు ప్రచారం సాగుతున్నప్పటికీ ఆ వాహనాలపై రష్యా సైనిక గుర్తులు మాత్రం లేవు. డొనెట్స్‌క్‌కు సమీపంలో ఐదు, నగరంలో మరో 2 యుద్ధ ట్యాంకులు కనిపించాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
Ukraine-Russia Standoff
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌లోని వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిసూ ఉత్తర్వులు జారీ చేశారు. పుతిన్ ప్రకటనతో ఉక్రెయిన్‌ను మూడు ప్రాంతాలుగా ముక్కలు చేసినట్లైయింది. అప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు డొనెట్స్‌క్, లుహాన్స్‌క్ ప్రాంతాలు దేశాలగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. ఉక్రెయిన్.. రష్యాలో అంతర్భాగమని చరిత్ర చెబుతోందని గుర్తుచేసిన పుతిన్.. రెండు దేశాలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వేర్పాటువాదులు 2014లో స్వతంత్రహోదా ప్రకటించుకున్న ప్రాంతాల స్వతంత్రతను తాము గుర్తిస్తున్నట్లు రష్యా అధికార ప్రతినిథి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. నల్ల సముద్రంలో కీలక ఓడరేవు మారియుపోల్ సహా ఉక్రెయిన్ బలగాల అధీనంలో ఉన్న ప్రాంతాలకు కూడా గుర్తింపు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఐతే వేర్పాటువాదులు చెబుతున్న ప్రాంతాల్లో మెజార్టీ భాగం తమ అధీనంలో ఉన్నట్లు ఉక్రెయిన్ బలగాలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్ భూభాగంలో రష్యా సేనలు
Ukraine vs Russia Army: తూర్పు ఐరోపాలోని రెబల్ ప్రభావిత ప్రాంతాలకు రష్యా సేనలు తరలుతున్నాయని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే అది పూర్తిస్థాయి యుద్ధంకాదని సంకేతాలు ఇస్తున్నాయి. రష్యా బలగాలు వేర్పాటువాదుల అధీనంలోని డాన్‌బాస్‌లో ప్రవేశించినట్లు ఐరోపా విదేశీ విభాగం అధినేత జోసెప్ బెర్రెల్ పారిస్‌లో చెప్పారు. అయితే ఇది పూర్తిస్థాయి యుద్ధమని తాను చెప్పలేనన్నారు. కానీ.. ఉక్రెయిన్ భూభాగంలో రష్యా సేనలు ఉన్నట్లు ఆయన స్పష్టంచేశారు. పోలండ్ రక్షణశాఖ, బ్రిటన్ ఆరోగ్యమంత్రి సాజిద్ జావిద్ కూడా రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్‌లో ప్రవేశించినట్లు వెల్లడించారు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని తమ అధీనంలో ఉన్న పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో మోహరించినట్లు డానెట్స్‌క్ వేర్పాటువాద నేత వ్లాదిస్లావ్ బ్రేగ్ వెల్లడించారు.
World countries Sanctions on Russia
ఉక్రెయిన్‌ను మూడు ముక్కలుగా చేస్తూ తీసుకున్న నిర్ణయం సహా.. ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయనే ఆరోపణలతో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.
- రష్యా నుంచి తమ దేశానికి సహజవాయువును తీసుకురానున్న నోర్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్‌లైన్ ధ్రువీకరణను నిలిపివేసినట్లు జర్మనీ తెలిపింది. ఇంకా ఆ పైప్‌లైన్ నుంచి గ్యాస్ సరఫరా ప్రారంభం కాలేదని వివరించింది.
- ఐదు రష్యా బ్యాంకులు, ముగ్గురు కీలక వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
- రష్యా గుర్తించిన రెండు వేర్పాటువాద ప్రాంతాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలు నిలిపివేసే కార్యానిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.
- తాజా పరిణామాల నేపథ్యంలో రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకునే అంశాలను పరిశీలిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు. మాస్కోలోని రాయబారిని వెనక్కి పిలుస్తామన్నారు.
- ఐరోపా సమాఖ్య సైతం ఆంక్షలను విధించేందుకు సమావేశమైంది.
రష్యా అనుకూల వేర్పాటువాదులు జరిపిన కాల్పుల్లో తమ సైనికులు ఇద్దరు చనిపోయినట్లు వెల్లడించిన ఉక్రెయిన్.. మరో 12 మంది గాయపడినట్లు తెలిపింది.
Ukraine Russia Effect on Stock Market
ఉక్రెయిన్ సంక్షోభం ముదరడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత భయాలు అలముకున్నాయి. ఫలితంగా మంగళవారం బ్రెంట్ క్రూడ్ పీపా ధర ఏడేళ్లలో అత్యధికంగా 97.76 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల స్వతంత్ర హోదాను గుర్తించిన రష్యా.. అక్కడికి దళాలను పంపాలని నిర్ణయించుకొంది.
- ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం లండన్‌లోని ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ 1.4శాతం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.
- ఆసియాలోని చాలా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
- జపాన్ నిక్కీ సూచీ 1.4శాతం పతనం కాగా.. షాంఘై కాంపోజిట్ ఒక శాతం పతనమైంది.
- బెర్లిన్‌కు చెందిన డీఏఎక్స్ సూచీ 2శాతం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
- ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ-40 కూడా 1.5శాతం విలువ కోల్పోయింది.
- అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.
- భారత్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
చమురు ధరల మోతే..!
ప్రపంచంలో సౌదీ అరేబియా తర్వాత అత్యధిక చమురును ఎగుమతి చేసే దేశం రష్యానే. అత్యధిక సహజవాయువు రష్యా నుంచే వస్తుంది. ప్రపంచంలో వినియోగించే ప్రతి 10 పీపాల చమురులో ఒక పీపా ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఈ నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ఎగుమతులపై దీని పెను ప్రభావం పడుతుంది. చమురు, గ్యాస్‌కు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. దీంతో బ్యారల్ 100 డాలర్లను తేలిగ్గా దాటేస్తుంది.
ఇవీ చూడండి:
రష్యా చర్యపై ఆ దేశాల ఆగ్రహం.. అమెరికా ఆంక్షలు
ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ఎంట్రీ! ఇక కష్టమే!!
ఉక్రెయిన్ జవాన్లపై రష్యా సైన్యం దాడి- ఐదుగురు మృతి
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన.. 'శాంతి'కి పిలుపు