స్మార్ట్ఫోన్లు, కార్లపై యుద్ధం ఎఫెక్ట్!
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీరక పోరు ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచం ఈ యుద్ధంతో మళ్లీ ఆందోళన చెందుతుంది. ఇప్పటికే ముడి చమురు ధరలు గరిష్ఠస్థాయికి చేరాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు సైతం భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీ కండక్టర్ల తయారీకి కీలకమైన నియాన్, పల్లాడియం ఉత్పత్తిలో సింహభాగం ఈ రెండు దేశాల నుంచే ఎగుమతి అవుతుండటం ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
సంబంధాలు కొనసాగించండి..
రష్యాతో యథావిధిగా సంబంధాలు కొనసాగించాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఆంక్షలు విధించటం వల్ల తామే లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. తమకు ఎలాంటి దురుద్దేశాలు లేనందున ఉద్రిక్తతలు పెంచే చర్యలతోపాటు ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదన్నారు. తమ బాధ్యతలను తాము నిర్వహిస్తామని పుతిన్ పేర్కొన్నారు. రష్యా-టర్కీ సంయుక్తంగా నిర్మించిన కొత్త నౌక ప్రారంభోత్సవం సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు సహకరించకూడదని ఎవరైనా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అది వారికి కూడా నష్టం చేస్తుందని పుతిన్ స్పష్టం చేశారు.