ఉక్రెయిన్‌లోని సెంట్రల్ వెస్ట్రన్ రీజియన్ రాజధాని అయిన విన్నిట్సియాలో ఉన్న విమానాశ్రయంపై ఆదివారం రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా సేనలు ఎనిమిది ఆర్మీ రాకెట్లతో విరుచుకుపడి విమానాశ్రయాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సైతం వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎయిర్‌పోర్టులపైనా రష్యా బాంబులు వేస్తోందని, ఒడెస్సా నగరంపైనా రాకెట్ దాడులకు రష్యా సేనలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘నో ఫ్లై జోన్’ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. దాడుల కట్టడికి ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఐరోపా దేశాలను విజ్ఞప్తి చేశారు. ‘ప్రతిరోజూ ఈ విషయాన్ని మళ్లీమళ్లీ అడుగుతున్నాం. రష్యన్ క్షిపణులు, యుద్ధ విమానాలు, వారి ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకు ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయండి. అలా చేయకపోతే కనీసం ఆయుధాలనైనా ఇవ్వండి. ఇలా కాకుండా మేమంతా చనిపోవాలని మీరు భావిస్తున్నారా?’ అంటూ ఆవేదన చెందారు.