పింఛను పథకం తనకు వర్తిస్తుందని తెలియక గడిచిన 20 ఏళ్లలో సుమారు రూ.77లక్షలను కోల్పోయారు యూకేలోని ఓ వందేళ్ల వృద్ధురాలు. ఇంగ్లాండ్‌లోని క్రైడాన్లో 1921లో జన్మించిన మార్గరెట్ బ్రాడ్షా.. వృత్తిరీత్యా కెనడాలో 30ఏళ్ల పాటు నివసించారు. దీంతో 1990లో తిరిగి స్వదేశానికి చేరుకున్నాక.. జాతీయ పింఛను పథకం తనకు వర్తించదని భావించారు.
మరి ఎలా తెలిసింది?
2001లో 80వ పడిలోకి చేరినప్పటినుంచే మార్గరెట్.. పింఛనుకు అర్హురాలిగా మారారు. కానీ అ విషయం తెలియక 20 ఏళ్ల పాటు ఆ సొమ్మును తీసుకోలేదు. అయితే పింఛను తీసుకోనివారి గురించిన ఓ కథనాన్ని ఆమె కూతురు హెలెన్ (78) ఇటీవలే చదవడం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది.
అయితే జాతీయ బీమా పథకానికి ఎలాంటి చెల్లింపులు జరపనప్పటికీ 80 ఏళ్లు పైబడినవారు పింఛనుకు అర్హులే. ఈ లెక్కన 2001 నుంచి వారానికి రూ.8,461 చొప్పున మార్గరెట్ పొందాల్సి ఉంది. దీంతో ఎట్టకేలకు పింఛనుల శాఖ మాజీ మంత్రి స్టీవ్ వెబ్ సహకారంతో ఆమె వారాంతపు పింఛను పొందగలుగుతున్నారు.
ప్రస్తుతం కెనడాలో ఉద్యోగం ద్వారా వచ్చే చాలీచాలని పింఛనుతోనే ఓ వసతిగృహంలో ఉంటున్న మార్గరెట్.. ఈ వార్తతో ఉపశమనం పొందారు.
ఇప్పటివరకు ఆమెకు రూ.4.12లక్షలు మాత్రమే లభించాయి. మిగిలిన సొమ్మంతా పోయినట్లే.
ఇదీ చూడండి: చనిపోయినట్టు ఫొటోలు దిగడం.. ఆమెకు ఇష్టం!