ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. ఈ టీకా సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అక్కడి ఆరోగ్య సంరక్షణ, ఔషధ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది.
"ఈ టీకాను 4 నుంచి 12 వారాల వ్యత్యాసంతో రెండు డోసులు ఇవ్వాలి. కరోనాను నివారించడంలో ఈ టీకా సురక్షితంగా, సమర్థవంతంగా పని చేస్తోందని తేలింది. రెండో డోసు ఇచ్చిన 14 రోజుల తర్వాత కూడా ఎలాంటి తీవ్రమైన సమస్యలు కనిపించలేదు." అని ఆస్ట్రాజెనెకా టీకాకు ఆమోదం తెలిపిన బ్రిటన్ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
యూకే వ్యాప్తంగా మొత్తం 10కోట్ల డోసుల టీకా సరఫరాకు ఆ దేశం ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి 4కోట్ల డోసులను సరఫరా చేయనున్నారు అధికారులు.
ఇది బ్రిటన్ విజయం
ఆస్ట్రాజెనెకా టీకాకు ఆమోదంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తంచేశారు. దీనిని బ్రిటన్ శాస్త్రసాంకేతిక రంగం సాధించిన విజయంగా అభివర్ణించారు. సాధ్యమైనంత మందికి టీకా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టంచేశారు.
ఇదీ చదవండి: కొత్త రూల్- చిన్న పిల్లలకు కేక్, ఐస్క్రీమ్ బంద్!