కరోనా వైరస్‌తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని.. అయితే వెంటిలేటర్‌పై మాత్రం లేరని కేబినెట్ మంత్రి మైఖేల్ గోవ్ వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా వైద్యులు ఆక్సిజన్ అందిస్తున్నారని తెలిపారు. మరోవైపు ప్రధాని స్థానంలో ఆయన విధులు చక్కబెట్టేందుకు విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ సిద్ధమయ్యారు. ప్రధాని సాధారణ విధులకు దూరంగా ఉంటున్నప్పటికీ.. ప్రభుత్వ కార్యకలాపాలు సాఫీగానే సాగుతున్నాయని గోవ్ తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైద్య సహకారం అందించేందుకు అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే బోరిస్‌ను ఐసీయూలోకి తరలించామని వివరించారు. బీబీసీ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవ్ ఈ విషయాలు వెల్లడించారు.
అన్నింటికి ఆయనే..
కరోనా వైరస్‌పై మంగళవారం నుంచి జరగబోయే అన్ని సమీక్షలను మైఖేల్ రాబ్ పర్యవేక్షించనున్నారని గోవ్ తెలిపారు. ఈ వైరస్ ఎవరికైనా సోకే ప్రమాదం ఉందన్న విషయం ప్రధాని ఉదంతంతో స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ను కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఆంక్షల్ని ఎప్పుడు ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని సరైన సమయంలో మంత్రివర్గం మొత్తం కలిసి తీసుకుంటుందని వివరించారు.
పదిరోజుల క్రితమే..
పది రోజుల క్రితం బోరిస్ జాన్సన్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆదివారం నాటికి ఆయనకు లక్షణాలు తగ్గకపోవడం వల్ల ఆ రోజు సాయంత్రం లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రానికి లక్షణాలు కాస్త తీవ్రం కావడం కారణంగా ఐసీయూకి మార్చారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి:అమెరికా, బ్రిటన్లపై కరోనా కాటు-రికార్డు స్థాయిలో మరణాలు