బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం వల్ల దాన్ని అరికట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం అర్థరాత్రి నుంచి రెండో దఫా లాక్‌డౌన్ విధించారు. అత్యవసర చర్యలు చేపట్టడం సహా జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండేందుకు కఠినమైన నిబంధలు అమలు చేయనున్నారు. అవేంటంటే..
- బుధవారం నుంచి విద్యాలయాలు, దుకాణాలు, క్రీడా ప్రాంతాలు, మైదానాలు అన్నీ మూసేస్తారు. అన్నిరకాల పరీక్షలు రద్దు చేశారు.
- ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, మందుల దుకాణాలు, పోస్టాఫీసుల్లాంటి అత్యవసర సర్వీసులు మాత్రమే తెరవడానికి అనుమతించారు.
- స్నేహితులు, బంధువులు ఎవరైనా బయట కలుసుకోవడం నిషిద్ధం. ఒకరినొకరు మాత్రమే కలుసుకోవాలి. అదీ వారి వారి సొంత ఇంటిలోనే.
- చర్చిలు, ఇతర ప్రార్థన మందిరాలు తెరవడానికి అనుమతించారు. కానీ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సిందే. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్ని కొన్ని పరిమితులతో అనుమతిస్తున్నారు.
- కొవిడ్ వాక్సినేషన్, ఇతర వైద్య అవసరాల కోసం ఎవరైనా బయటికి వెళ్లొచ్చు. తోడుగా ఒక్కరు మాత్రమే ఉండాలి.
- హోటెళ్లు, రెస్టరెంట్లలో ఆహారం తినడానికి వీల్లేదు. అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లవచ్చు.
- లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి 200 పౌండ్లు (మన రూపాయల్లో రూ.20వేలు) జరిమానా విధిస్తారు. మళ్లీమళ్లీ అదే తప్పు చేస్తే అత్యధికంగా రూ.6.36లక్షలు ఫైన్ కట్టాల్సిందే. సరైన కారణం లేకుండా బయటికి వచ్చిన వారిని జైలులో వేసే అధికారం పోలీసులకు కల్పించారు.
బ్రిటన్‌లో అంతర్భాగమైన వేల్స్‌లో డిసెంబరు 20 నుంచే పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. తాజా సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తరకం కరోనా వైరస్ బారినపడి బ్రిటన్‌లో 407 మంది మరణించారు. 58,784 మంది పాజిటివ్‌గా తేలారు. ఈ లాక్‌డౌన్ ఆరువారాల పాటు అమల్లో ఉంటుంది. ఫిబ్రవరి రెండోవారంలో సమీక్షిస్తారు.
ఇదీ చదవండి : 'అందరికీ టీకా' కావాలంటే ఒకే డోసు తీసుకోవాలా?