ఇంకా కొద్ది రోజుల్లో ఇంట్లోకి కొత్త వారసుడో, వారసురాలో వస్తుందనే వార్త తెలిస్తే ఆ కుటుంబంలో ఆనందానికి చెప్పలేని ఆనందం ఉంటుంది. బ్రిటన్కు చెందిన ఓ కుటుంబం కూడా ఇలానే సంతోషించింది. కానీ ప్రపంచాన్ని వినాశపు అంచుల్లోకి నెట్టేసిన కరోనా.. ఆ కుటుంబాన్ని కుదిపేసింది.
బ్రిటన్కు చెందిన టామీ లర్కిన్స్ భార్య ఎల్సా నిండు గర్భిణి. మార్చిలో బిడ్డకు జన్మనిస్తుందనంగా కరోనా బారిన పడింది. తీవ్ర అనారోగ్య సమస్యలు లేకున్నప్పటికీ కోమాలోకి వెళ్లిపోయింది. దాంతో ఆమెని అత్యవసర విభాగంలో చేర్చారు.
పరిస్థితి చేయి దాటిపోయిందని అంతా భావించారు. వైద్యులు కూడా నమ్మకం కల్పించకపోవడం వల్ల భార్యతో పాటు పుట్టబోయే బిడ్డపై టామీ ఆశలు వదులుకున్నాడు. ఒకవేళ నెలలు నిండకముందే బిడ్డ జన్మించినా.. ఎంతోకాలం బతకదేమోనని భావించాడు. తీరని దు:ఖంలో మునిగిపోయాడు.
"నిండు గర్భినైన నా భార్యకు కరోనా సోకింది. అయితే ఆమె అనూహ్యంగా కోమాలోకి వెళ్లింది. దాంతో నేను తట్టుకోలేక పోయాను. ఎన్నడూ అనుభవించని బాధను భరించాను. ఇక నా భార్య, పుట్టబోయే బిడ్డ దక్కరనుకున్నాను."
-టామీ లర్కిన్స్, భర్త
ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు అద్భుతం చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరతతో పాటు సరైన వసతులు లేకున్నా విజయవంతంగా ఆ గర్భిణికి శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఇప్పుడు ఆ శిశువు క్షేమంగా ఉంది.
పుట్టిన బిడ్డ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. ఎల్సా మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వైద్య బృందానికి కృతజ్ఞతగా ఆ పాపకి ఫ్లోరెన్స్ అని పేరు పెట్టారు.
ఇదీ చూడండి: క్రిస్టోఫ్ తుపాను ధాటికి బ్రిటన్ గజగజ