కరోనా మహమ్మారితో బ్రిటన్ విలవిల్లాడుతోంది. కొత్త కేసుల నమోదులో అగ్రరాజ్యం అమెరికాతో పోటీపడుతోంది. వైరస్ ప్రారంభమైన తర్వాత తొలిసారి రోజువారీ కేసుల నమోదులో గరిష్ఠ స్థాయిని చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 60వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 830 మంది మరణించారు.
ఇటీవల బయటపడిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌తో రోజు వారీ కేసుల రేటు గణనీయంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. కొత్త రకం కేసులతో కలిపి మంగళవారం మొత్తం 60,916 కేసులు బయటపడినట్లు వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,720,000కు చేరింది. అలాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 76,305 మంది మరణించారు.
లాక్డౌన్..
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్లలో లాక్డౌన్ విధించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రజలు అత్యవసరాలకు మినహా బయటకి రావొద్దని గత సోమవారం కోరారు ప్రధాని బోరిస్ జాన్సన్. కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సిన్ పంపిణీపై రోజువారీ డేటా విడుదల చేస్తామని తెలిపారు ప్రధాని. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారిని రక్షించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
గత ఏడాది డిసెంబర్ 29 నుంచి రోజుకు 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇదీ చూడండి: లాక్డౌన్ పాటించకపోతే రూ.6లక్షల ఫైన్!